AP CM Chandrababu (Photo-TDP/X)

Tirupati, Jan 9: తిరుమల (Tirumala) వైకుంఠ ద్వార దర్శన టికెట్ల (Vaikuntha Darshan tickets) జారీలో తీవ్ర అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనలో ఆరు మంది చనిపోగా పలువురికి గాయాలు అయ్యాయి. తిరుపతి వైకుంఠ ద్వారం దర్శన సమయంలో తొక్కిసలాట ఘటనపై అధికారుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తులు పెద్దఎత్తున హాజరవుతారని ముందే తెలిసినా తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు.ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తత ఎంతో కీలకమని, అధికారుల బాధ్యత ఏంటని ప్రశ్నించారు. టోకెన్ల పంపిణీ కౌంటర్ల నిర్వహణపై సమీక్షించి భద్రతా ఏర్పాట్లను మెరుగుపరచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చింతించటం తప్ప మనం చేసేది ఏమీ లేదని వెల్లడి, భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ

క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. వారికి సాధ్యమైనంత ఉత్తమమైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో విజయవంతమైన కార్యక్రమాన్ని పూర్తి చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అభివర్ణించారు. ఈరోజు ఆలస్యంగా తిరుపతికి వచ్చిన చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించి, మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించనున్నారు.

బిజెపి నాయకురాలు పురందేశ్వరి నుండి స్పందన:

తొక్కిసలాట మరియు ప్రాణనష్టం పట్ల బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దిగ్భ్రాంతి మరియు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి టీటీడీ అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం ప్రారంభించారు.