తిరుమల తిరుపతి దేవస్థానం నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. అక్టోబర్ కోటా టికెట్లను విడుదల చేయనుంది. అక్టోబర్ మాసానికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈనెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పాతిక వేల మంది భక్తులు తలనీలాలు, 71 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
ఇక తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం వెళ్లిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విమానం రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చిందా.. లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమల ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే తరచూ ఆలయ పైభాగంలో విమానాలు వెళుతున్నాయి. తాజాగా ఘటన నేపథ్యంలో టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు.
గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో సోమవారం సాయంత్రం ఆణివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు.పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు ఆణివార ఆస్థానం. నాటి నుంచి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్‌ను మార్చి, ఏప్రిల్ నెలలకు మార్చారు.
ఆణివార ఆస్థానంలో భాగంగా గోవిందరాజస్వామి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేసి సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు. అలాగే కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం గరుడాళ్వార్ ఎదురుగా సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. అలాగే అలిపిరి పాదాల మండపం వద్దనున్న లక్ష్మీనారాయణస్వామి ఆలయంలోనూ ఆణివార ఆస్థానం నిర్వహించారు.