Lucknow, June 7: యూపీలో వింత ఘటన చోటు చేసుకుంది. యూపీ పోలీసులు ఓ బర్రెకి,ఓ పిల్ల దున్నపోతుకి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నారు. దాని అసలు యజమాని ఎవరనే దానికి ఈ టెస్టులు చేయిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని షామిల్ జిల్లాలోని అహ్మద్ ఘర్ గ్రామంలో నివసించే చంద్రపాల్ కశ్యప్ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే 2020 ఆగస్టు 25న తన కౌషెడ్ నుంచి మూడేళ్ల వయస్సు ఉన్న దున్నపోతుని ఎవరో దొంగలించారని,అయితే అదే ఏడాది నవంబర్ లో షారాన్ పూర్ జిల్లాలోని బీన్పూర్ గ్రామంలో ఆ దున్నపోతుని తాము గుర్తించామని,అయితే ఆ దున్నపోతు తమదేనని సత్బీర్ సింగ్ అనే వ్యక్తి వాదిస్తూ దానిని తమకు ఇవ్వడం లేదని చంద్రపాల్ కశ్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే ఈ ఫిర్యాదు తర్వాత కరోనా రావడంతో ఈ కేసు పక్కకు పోయింది. ఇప్పుడు ఆ దున్నపోతు అసలు యజమాని (Confirm Owner) ఎవరో గుర్తించేందుకు షామిల్ ఎస్పీ సుకృతి మాధవ్..కశ్యప్ దగ్గర ఉన్నట్లు చెప్పబడుతున్న తల్లి బర్రెకి,షారాన్ పూర్ లో సత్పీర్ సింగ్ దగ్గర ఉన్న పిల్ల దున్నపోతుకి డీఎన్ఏ టెస్ట్ (Shamli Police Orders DNA Test of Stolen Buffalo) చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. షామిల్ ఎస్పీ సుకృతి మాధవ్ మాట్లాడుతూ..."ఆ దున్నపోతు అసలు యజమాని ఎవరో తెలుసుకోవడం నిజంగా సవాలుగా మారింది. అయితే తన వద్ద దూడ తల్లి ఉందని కశ్యప్ పేర్కొన్నందున..మేము DNA పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నాము" అని చెప్పారు.
అయితే తన దూడను ఎలా గుర్తించాడో కశ్యప్ వివరిస్తూ..."మానవుల వలె, జంతువులు కూడా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఆ దున్నపోతు ఎడమ కాలు మీద మచ్చ ఉంది. తోక చివర తెల్లటి పాచ్ కూడా ఉంది. మూడోది జ్ణాపకశక్తి. నేను దగ్గరకు వెళ్ళినప్పుడు, అది నన్ను గుర్తించి నన్ను చేరుకోవడానికి ప్రయత్నించింది. దాని ఐడెంటిటీని బయపెట్టేందుకు ఇంతకుమించిన నేను ఏం చేయాలి" అని ప్రశ్నించారు. కాగా, ఈ కేసులో దర్యాప్తు అధికారి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.."పశువులకు డీఎన్ఏ టెస్ట్ చాలా అరుదు. ఇలాంటి టెస్ట్ కోసం ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి ల్యాబ్ లేదు. పశు సంవర్థక డిపార్ట్మెంట్ నుంచి గత గురువారం కొందరు వెటర్నరీ డాక్టర్లు వచ్చి ఆ దూడ,దాని తల్లి అని చెప్పబడుతున్న బర్రె వద్ద నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని గుజరాత్ లేదా ఢిల్లీలో ఉన్న ల్యాబ్ లో టెస్ట్ చేయనున్నారు"అని తెలిపారు. టెస్ట్ తర్వాత ఆ దూడ యజమాని ఎవరో తేలుతుందని తెలిపారు.