Newdelhi, July 6: కోర్టుల్లో (Court) న్యాయ విచారణ గురించి తెలిసిందే. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవలకు ఊరి పంచాయితీ పెద్దలు సయోధ్యతో ముగింపునివ్వడమూ చూస్తాం. అయితే, ఇద్దరు ఓనర్ల మధ్య మొదలైన పంచాయితీని ఓ గేదె (Buffalo) పరిష్కరించింది. వివరాల్లోకెళితే.. యూపీలోని (UP) ప్రతాప్ గఢ్ జిల్లా అక్షరాంపూర్ గ్రామంలో నందలాల్ సరోజ్ కు చెందిన గేదె కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది. అది పూరే హరికేశ్ గ్రామానికి చేరింది. ఆ ఊరికి చెందిన హనుమాన్ దాన్ని కట్టేశాడు. నందలాల్ ఎంత వెతికినా గేదె ఆచూకీ దొరకలేదు. చివరికి హనుమాన్ వద్ద ఉన్నదని తెలిసి, అక్కడికి వెళ్లి అడగ్గా.. ఆ గేదె తనదేనని వాదించాడు. దీంతో నందలాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, పంచాయితీకి పిలిపించాడు.
గేదె తీర్పు ఇలా..
ఆ గేదె తనదేనని హనుమాన్, నందలాల్ గొడవపడ్డారు. ఏం చేయాలో పాలుపోకపోవటంతో స్టేషన్ ఆఫీసర్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ గేదెను రెండు ఊళ్ల మధ్య విడిచిపెట్టి, ఆ గేదె ఏ యజమాని చెంతకు చేరితే వారే అసలైన యజమాని అని స్పష్టం చేశారు. దానికి ఇరు వర్గాలు సమ్మతించాయి. దీంతో ఆ గేదెను తీసుకొచ్చి రెండు ఊళ్ల మధ్య విడిచిపెట్టగా, అది నేరుగా నందలాల్ ఇంటికి చేరింది. దీంతో హనుమాన్ ను పోలీసులు, గ్రామస్థులు మందలించారు. అలా గేదె తన యజమానిని ఎన్నుకొన్నది.