Ignaz Semmelweis: చేతులు కడుక్కోవడంపై ఏనాడో చెప్పిన ఓ గొప్పశాస్త్రవేత్త, తల్లులకు పునర్జన్మను ప్రసాదించిన మహానుభావుడు, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్ ఇగ్నాజ్ సెమ్మెల్‌వైస్‌ను స్మరిస్తూ గూగుల్ ప్రత్యేక డూడుల్
Google Doodle Remembering Dr. Ignaz Semmelweis | Google Photo

నేడు ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి ప్రజలను అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ కు ఇప్పటివరకు వ్యాక్సిన్ తయారు కాబడలేదు, కాబట్టి నివారణ ఒక్కటే మార్గం. ఇందుకోసం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం ఎంతో అవసరం. దీని ఆవశ్యకతను తెలుపుతూ ఈరోజు గూగుల్ తన ప్రత్యేకమైన డూడుల్ ను ప్రదర్శిస్తుంది. చేతులను ఎలా కడుక్కోవాలో వీడియోలో చూపిస్తూ ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఇగ్నాజ్ సెమ్మెల్‌వైస్‌ను ( Ignaz Philipp Semmelweis) గుర్తుచేసుకుంటోంది.

జూలై 1, 1818 న హంగేరిలోని బుడా (ఇప్పుడు బుడాపెస్ట్) లో జన్మించిన డా. ఇగ్నాజ్ సెమ్మెల్విస్ వియన్నా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు మరియు తరువాత మిడ్‌వైఫరీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. క్రిమినాశక (antiseptic procedures) విధానాలను కనుగొనడం మరియు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించగలమనే విషయాన్ని ఆయన గుర్తించారు.  "తల్లుల రక్షకుడు" గా అభివర్ణించబడిన డా. ఇగ్నాజ్, ప్రసూతి సమయంలో చేతులకు క్రిమిసంహారకం వాడటం ద్వారా బిడ్డలకు జన్మనిచ్చే తల్లులకు 'ప్యూర్పెరల్ జ్వరం' సోకకుండా కాపాడవచ్చునని ఆయన కనుగొన్నారు.

1847లో ప్యూర్పెరల్ జ్వరం లేదా "చైల్డ్ బెడ్" అని కూడా పిలువబడే ఒక అంతుచిక్కని ఇన్ఫెక్షన్ ఐరోపా అంతటా వ్యాపించి ప్రసూతి వార్డులలో బాలింతల మరణాకు దారితీసింది. ఆ సమయంలో డా. ఇగ్నాజ్ సెమ్మెల్‌వైస్‌ జనరల్ హాస్పిటల్ యొక్క ప్రసూతి క్లినిక్ లో చీఫ్ రెసిడెంట్ గా నియమింపబడ్డారు. చైల్డ్ బెడ్ ఇన్ఫెక్షన్ పై సమగ్ర విశ్లేషణ చేసిన డా. ఇగ్నాజ్, అదొక అంటువ్యాధిని ఇంకొకరి నుంచి బాలింతలకు ప్రసారం అవుతుందని గుర్తించారు. అది వైద్యుల ద్వారానే ఆపరేషన్ల సమయంలో జరుగుతున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఆయన వ్యక్తిగత పరిశుభ్రత మరియు శుభ్రమైన చేతుల యొక్క ప్రాముఖ్యతను రోగులకు మరియు వైద్యులకు వివరించారు. రోగులకు, ముఖ్యంగా తల్లులకు సర్జరీలు చేసే ముందు వైద్యులు తమ చేతులను క్రిమిసంహారక చేసుకోవాలని సూచించి, దాని ఫలితాన్ని నిరూపించారు. ఈ చర్య తదనంతర కాలంలో సంక్రమించే అంటువ్యాధుల స్థాయిని తగ్గించింది. సేఫ్‌హ్యాండ్స్ ఛాలెంజ్‌ని ప్రారంభించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

అయితే డాక్టర్ ఇగ్నాజ్ తన అధ్యయనాలకు ప్రయోగాత్మకమైన ఆధారాలను చూపలేకపోయారు. ఈ విషయంలో ఆయనకు అతడి సహచర వైద్యుల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఏ ఇన్ఫెక్షన్లపైన అయితే అతడు పోరాటం చేశారో, చివరకు అదే ఇన్ఫెక్షన్ సోకి అతడు ప్రాణాలు కోల్పోయారు.

డాక్టర్ ఇగ్నాజ్ మరణం అత్యంత దురదృష్టకరమైనది. 1865 అతడి మానసిక ఆరోగ్యం క్షీణించింది. ఆయనను ఇతర డాక్టర్లు, సెక్యురిటీ సిబ్బంది కొట్టి పిచ్చోడిగా ముద్రవేశారు. మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్చారు, దాడి సమయంలో అతడి కుడిభుజంపై అయిన గాయం తర్వాత సెప్టిక్ అయి 14 రోజుల్లోనే 47 ఏళ్ల వయసప్పుడు చనిపోయాడు.

Google Doodle Remembering Dr. Ignaz Semmelweis

కానీ, డా. ఇగ్నాజ్ మరణాంతరం ఆయన గొప్పతనం తెలిసొచ్చింది. డా. ఇగ్నాజ్ చేసిన అధ్యయనాలు, పరిశోధనలు ఆయన టెక్నిక్స్ మైక్రోబయాలజీ శాస్త్రంలో విశేషమైన అభివృద్ధికి సహాయపడ్డాయి.

నేడు కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చేతులను పరిశ్రుభంగా ఉంచుకొని అంటువ్యాధులను నివారించుకునే అవసరం ఏర్పడటంతో ఆ గొప్పశాస్త్రవేత్తను ప్రపంచం మరోసారి స్మరించుకుంటోంది.