Horse chariot unstoppable | (Photo Credits: Twitter)

మగధీర సినిమాలో ఒక గుర్రం నియంత్రణ కోల్పోయి నగర రోడ్లపై బీభత్స సృష్టిస్తూ పరుగులు తీస్తుంది, అది చూసిన హీరో దానిని ఛేజ్ చేసి, ఆ గుర్రాన్ని అందుకొని, అమాంతం దానిపైకి ఎగిరి నియంత్రిస్తాడు, ఇది సినిమా.

అయితే ఇలాంటి సన్నివేశం పుణె (Pune) నగరంలో జరిగింది, కాకపోతే సీన్ తలకిందులైంది.  రెండు ధృడమైన అశ్వాలు సారథి  లేకుండానే రథంతో పాటు (Horse Chariot) పుణె రోడ్లపై విజృంభించి పరుగులు పెట్టాయి. దీంతో దానిని నడిపేవాడు (Chauffeur), రథాన్ని మరియు ఆ గుర్రాలను ఆపేందుకు ఒక బైక్ పై ట్రిపుల్ రైడింగ్ లో వెళ్లాడు. ఎలాగో అలా ఆ గుర్రాలను అందుకున్నాడు గానీ, వాటిని ఆపే క్రమంలో పట్టుకోల్పోయి కింద పడ్డాడు. దీంతో అతణ్ని ఆ గుర్రాలు తొక్కేయడమే కాకుండా రథ చక్రాలు కూడా అతడి పైనుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతడికి గాయాలయి ఆసుపత్రిలో చేరాడు. అతడి పేరు జితేంద్ర కదమ్ గా తెలిసింది. ఈ ప్రమాదంలో ఒక గుర్రానికి కూడా స్వల్ప గాయాలయినట్లుగా చెబుతున్నారు.

ఈ సంఘటన డిసెంబర్ 6, శుక్రవారం పూణేలోని కోరెగావ్ పార్క్ జంక్షన్ వద్ద జరిగింది. ఈ సన్నివేశాన్నంతా ఒక పౌరుడు తన ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో వెంటనే వైరల్‌గా మారింది.

ఇదే ఆ వీడియో:

కాగా, ఆ రథాన్ని చూస్తే లైట్లతో అందంగా అలంకరించబడి రాత్రి వేళ జిగేలుమంటూ మెరుస్తూ ఉంది. ఏదైనా వివాహా వేడుకల నుంచి తప్పించుకొని ఉండవచ్చునని భావిస్తున్నారు. రోడ్లపై వెలుగు జిలుగుల గుర్రాల రథం అలా పరుగులు పెడుతుంటే కొంతమంది ఆశ్చర్యపోగా, మరికొంత మంది ఎక్కడ తమ మీదికి వస్తుందా అని భయపడిపోయారు. అయితే అదృష్టవషాత్తూ ఈ సంఘటన వలన ప్రజలకు ఎలాంటి హాని జరగలేదు.

ఈ ఘటనపై కోరేగావ్ పార్కు పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహాది కార్యక్రమాల కోసం గుర్రపు బండ్లను ఉపయోగించ వద్దని పోలీసులు సూచించారు. ఒకవేళ గుర్రాలను నియంత్రించలేకపోతే తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.