Shocking Incident: పోస్టుమార్టం నిర్వహిద్దామనుకుంటుండగా మృతదేహానికి నిక్కబొడిచిన రోమాలు, విస్మయానికి గురైన వైద్యుడు, కర్ణాటకలో షాకింగ్ ఘటన
Representational Image (Photo Credits: ANI)

Belagavi, March 4: ఓ 27 ఏళ్ల యువకుడికి ఇటీవల యాక్సిడెంట్ జరిగింది, వెంటనే అతణ్ని దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా , సదరు ఆసుపత్రి నిర్వాహకులు ఆ యువకుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని నిర్ధారించారు. ఇక పోస్టుమార్టం నిర్వాహిద్దామని సిద్ధమైన మరో వైద్యుడు ఆ మృతదేహం చేయిపట్టుకోగానే ఒక్కసారి మృతుడి చేతికున్న రోమాలు నిక్కబొడుచుకున్నాయి. దీంతో వైద్యుడు షాక్ అయ్యాడు, వెంటనే అతడి కుటుంబీకులకు విషయాన్ని చేరవేశాడు. ఇంతకీ ఆ యువకుడు చనిపోయాడా? లేక ఇది ఆ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమా? తెలియాలంటే అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన శంకర్ గోంబి అనే 27 ఏళ్ల యువకుడు ఇటీవల ఫిబ్రవరి 27న మహాలింగాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతణ్ని బెలగావి పట్టణంలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో అతడికి రెండు రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అనంతరం మార్చ్ 1న ఆ యువకుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని ఆసుపత్రి వర్గాలు నిర్ధారిస్తూ,  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

శంకర్ మరణ వార్త విని పెద్ద సంఖ్యలో అతడి శ్రేయోభిలాషులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు.  అంతేకాకుండా శంకర్ మన నుంచి వెళ్లిపోయాడంటూ అతడి మిత్రులు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో పాటు, దారి పొడవున్నా ఫ్లెక్సీలు కూడా పెట్టించారు. మరోవైపు శంకర్ కుటుంబీకులు తీవ్ర దు:ఖంతో అతడి అంతిమ సంస్కారాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే శంకర్ మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియ నిర్వహించడానికి అపాయింట్ చేయబడిన డాక్టర్ ఎస్.ఎస్ గల్గలీ (Dr. Galgali) ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.  పోస్టుమార్టం ఇక ప్రారంభిద్దాం అని చేయి పట్టుకోగా మృతుడి చేతికున్న రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆశ్చర్యానికి గురైన డాక్టర్, అతడి సెన్సెస్ ఇంకా పనిచేస్తున్నాయా అని అనుమానించారు. అప్పటికీ శంకర్ దేహం వెంటిలేటర్ పైనే ఉండటం గమనించి కొద్దిసేపు వెంటిలేటర్ నిలిపివేశాడు. అప్పటికీ కూడా శంకర్ చేతులు ఆడించడం గమనించిన డాక్టర్ గల్గలీ ఆ యువకుడి పల్స్ చూడగా,  నాడీ ఇంకా కొట్టుకుంటున్నట్లు గ్రహించారు.

దీంతో ఆ యువకుడికి ఇంకా బ్రతికే అవకాశం ఉందని గ్రహించిన డాక్టర్ గల్గలీ వెంటనే అతడి కుటుంబీకులకు విషయాన్ని తెలియపరిచి, ఆ యువకుడిని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  ఇది జరిగిన 24 గంటల తర్వాత మంగళవారం నుంచి శంకర్ శరీరం వైద్యానికి సహకరిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీని తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితిపై ఏదైనా సమాచారం వస్తే ఈ ఆర్టికల్ అప్ డేట్ అవుతుంది.

కాగా, తన 18 ఏళ్ల సర్వీసులో సుమారు 400కు పైగానే పోస్టుమార్టం ప్రక్రియలు నిర్వహించానని చెప్పుకొచ్చిన డాక్టర్ గల్గలీ, ఇలాంటి కేసు మాత్రం తొలిసారిగా చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు ఈ తప్పిదానికి కారణం మొదట శంకర్ ను చేర్పించిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులదే అని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఈ ఘటనను వైద్య నిర్లక్ష్యంగా పేర్కొన్న పోలీసులు జిల్లా వైద్యాధికారి సదరు ఆసుపత్రిపై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.