Chitradurga, November 1: స్కూలులో (School) జరిగే నాటకంలో (Drama) పాల్గొనేందుకు ఇంట్లో ప్రాక్టీస్ (Practise) చేస్తూ ఓ విద్యార్థి (Student) ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని (Karnataka) చిత్రదుర్గలో (Chitradurga) చోటుచేసుకుందీ విషాదకర సంఘటన. బాలుడి తల్లిదండ్రులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిత్రదుర్గకు చెందిన నాగరాజ్ గౌడ, భాగ్యలక్ష్మి దంపతులు తిప్పాజీ సర్కిల్ లో చిన్నపాటి హోటల్ నడుపుతుంటారు. ఈ దంపతుల కొడుకు సంజయ్ గౌడకు పన్నెండు సంవత్సరాలు. బదవానెలోని ఓ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సంజయ్ ను ఇంట్లో ఉంచి నాగరాజ్, భాగ్యలక్ష్మీ హోటల్ కు వెళ్లిపోయారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న భాగ్యలక్ష్మి ఎన్నిసార్లు తలుపుతట్టినా సంజయ్ తెరవలేదు. దీంతో పక్కింటి వాళ్ల సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్న సంజయ్ కనిపించాడు. కిందికి దింపి పరీక్షించగా అప్పటికే ప్రాణం పోయిందని తేలింది.
అసలేం జరిగింది..
స్కూలులో త్వరలో జరగబోయే వేడుకలలో పాల్గొనేందుకు సంజయ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని తండ్రి నాగరాజ్ చెప్పారు. భగత్ సింగ్ నాటకం ప్రాక్టీస్ చేస్తున్నాడని వివరించారు. ఆరోజు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్న సంజయ్.. ఉరి వేసుకునే సీన్ ను ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయి ఉంటాడని నాగరాజ్ చెప్పారు. అయితే, స్కూలు యాజమాన్యం మాత్రం నాటకం వేయాలని కానీ, భగత్ సింగ్ వేషం పోషించాలని కానీ విద్యార్థులు ఎవరికీ చెప్పలేదని స్పష్టం చేసింది. దీంతో సంజయ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.