Mumbai, October 18: మహారాష్ట్రలో (Maharastra) ఓ మంత్రికి (Minister) శస్త్రచికిత్స చేస్తుండగా విద్యుత్ సరఫరా (Power Supply) నిలిచిపోయింది. దీంతో సెల్‌ఫోన్‌లోని (Mobile) టార్చ్ సాయంతో వైద్యులు ఆపరేషన్ పూర్తి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి సందీపన్ భుమ్రే (Sandipan Bhumre) ఇటీవల ఔరంగాబాద్‌లోని ఘటి డెంటల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దంత పరీక్ష చేయించుకున్నారు. పరీక్షించిన వైద్యులు రూట్ కెనాల్ ఆపరేషన్ చేయించుకోవాలని మంత్రికి సూచించారు. ఆయన సరేననడంతో ఆపరేషన్ ప్రారంభించారు.
ఆపరేషన్ ప్రారంభమైన కాసేపటికే ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మరో మార్గంలేక సెల్‌ఫోన్‌లోని టార్చ్ సాయంతో ఆపరేషన్ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అయ్యాయి. ఆసుపత్రికి జనరేటర్ సదుపాయం లేదని, గత కొంతకాలంగా అడుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు ఈ సందర్భంగా మంత్రికి విన్నవించారు. స్పందించిన ఆయన వెంటనే నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.