Mumbai, November 25: మహారాష్ట్ర (Maharashtra) లో కొనసాగుతున్న 'పవర్ పాలిటిక్స్' భారత రాజకీయ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని వింత పరిస్థితిని సృష్టించాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య గొడవలు, వైరిపక్షాలతో మితృత్వం, రాష్ట్రపతి పాలన, ఇవన్నీ దాటుకొని శివ్ సేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackery) రేపు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని ఎన్‌సిపి- శివసేన- కాంగ్రెస్ ముక్తకంఠంగా రాత్రి ప్రకటించి తర్వాత, పొద్దున లేచి చూసి చూసేసరికి అంతా తారుమారు అయ్యింది.
ఆ రాత్రి అందరూ హమ్మయ్య ఏదో ఒక ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని హాయిగా నిద్రపోయి ఉదయం లేచి చూడగానే రాష్ట్రంలో ఎవరూ ఊహించని హఠాత్పరిణామం చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే దేవేంద్ర ఫడ్ణవిస్ (Devendra Fadnavis) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినట్లు న్యూస్ బయటకు వచ్చింది. ఎన్‌సిపిలో ఒకవర్గం విడిపోయి, బీజేపీ- ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. దీనికి ప్రధాని, హోంమంత్రి అందరూ శుభాకాంక్షలు చెప్పారు అనే వార్తలు ఒక్కసారిగా దేశ ప్రజానీకానికి విస్మయానికి గురిచేశాయి.
అయితే ఇలాంటి భయంకరమైన రాజకీయ విన్యాసాలకు సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. మరి అవ్వారా? ఏ సస్పెన్స్ థిల్లర్ సినిమాలో లేనటువంటి ట్విస్టులు, నరాలు తెగే ఉత్కంఠత, ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ దెబ్బతో ఓ ప్రొఫెసర్ షాక్ కు గురై మంచాన పడ్డాడట.
వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్రలోని గడ్చందూర్ (Gadchandur) పట్టణంలో ఓ కళాశాలలో ఇంగ్లీష్ బోధించే జహీర్ సయ్యద్ (Zaheer Syed). తాను మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయాలు చూసి షాక్ కు గురయ్యాను. రాత్రి శివసేన అభ్యర్థి సీఎం అని చెప్పిన, పొద్దున ఫడ్ణవిస్ ప్రమాణ స్వీకారం చేయడం చూసి షాక్ తో అనారోగ్యానికి గురయ్యాను. కాబట్టి నేను విధులకు హాజరు కాలేకపోతున్నాను, నాకు కొంతకాలం సెలవు మంజూరు చేయండి అంటూ లీవ్ లెటర్ రాశారు.
అయితే ఈయన లీవ్ లెటర్ చూసి కళాశాల యాజమాన్యం షాక్ అయింది. ప్రొఫెసర్ కారణం సరిగా లేదని ఆయన లీవ్ లెటర్ ను రిజెక్ట్ చేసింది. అయితే ప్రొఫెసర్ రాసిన లీవ్ లెటర్ ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో అది విపరీతంగా వైరల్ అవుతుంది.