Image: Youtube

ప్రవచనాలు చెప్పే స్వామిజీ ఆ ప్రవచనం చెబుతూనే వేదికపైనే ప్రాణాలు విడిచిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. బలోబల మఠం పీఠాధిపతి శ్రీసంగన బసవ మహా స్వామీజీ(54) ప్రసంగిస్తూనే స్టేజ్ పైనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా గుండెపోటు రాగా ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుర్చీలోనే కన్నుమూశారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే పీఠాధిపతి కన్నుమూశారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వామిజీ ప్రవచనాలు చెబుతున్నారు. వేదిక మీద ఉన్న వారు, భక్తులు అంతా శ్రద్దగా వింటున్నారు. ప్రవచనాలు చెబుతున్న స్వామీజీ ఒక్కసారిగా కుర్చీలోనే కుప్పకూలారు. దీంతో అక్కడ అలజడి రేగింది. స్వామీజీకి ఏమైందో తెలియక అంతా కంగారుపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పారు. గుండెపోటుతో స్వామీజీ కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు. తన పుట్టిన రోజు నాడే స్వామీజీ తుది శ్వాస విడిచారు. సంగనబసవ స్వామి బాలాబోల మఠానికి చెందిన వారు. బవసయోగ్ మండప్ ట్రస్ట్ పెద్దగా ఉన్నారు.