Tamilnadu Emarald Lingam: తమిళనాడులో పోలీసుల సోదాల్లో దొరికిన రూ.500 కోట్ల విలువైన మరకత లింగం, షాక్ లో పోలీసులు...

తంజావూరు, జనవరి 3:  పురాతన మరకత శివలింగం ఒకటి తమిళనాడులోని తంజావూరులో పోలీసుల సోదాల్లో లభించింది. దీని విలువ 500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏడీజీపీ కె.జయంత్ మురళి చెన్నైలో వెల్లడించారు. ఇదిలా ఉంటే తంజావూరులోని అరుళనంద నగర్ లో పోలీసులు డిసెంబర్‌ 30న సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎన్ఎస్ అరుణ్ అనే వ్యక్తిని ప్రశ్నించగా తన తండ్రి బ్యాంకు లాకర్ లో శివలింగాన్ని ఉంచినట్టు తెలిపాడు. ఈ సమాచారం ఆధారంగా బ్యాంకు లాకర్ లోని మరకత శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న దీనిని పురాతనమైనదిగా అరుణ్ పోలీసులకు తెలిపాడు. జెమాలజిస్టులు దీని విలువ 500 కోట్లు ఉంటుందని నిర్ధారించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక ఇది ఏ ఆలయానికి సంబంధించిందో విచారణలో తేలాల్సి ఉందన్నారు. 2016లో నాగపట్టణంలోని తిరుకువలాయ్ శివాలయం నుంచి కనిపించకుండా పోయిన శివలింగమా..కాద అనే దానిపై  విచారణ చేపడతామని తెలిపారు.