Chennai, April1: ప్రాణాలు పోయినా సరే టిక్ టాక్ (Tik Tok) లో మన పాపులారిటీ ఏమాత్రం తగ్గొద్దు అనేటట్లు ఉంది కొంతమంది టిక్ టాక్ యూజర్ల పిచ్చి. ఎంత అంటే కరోనావైరస్ సోకి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో బెడ్ పై ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఓ యువతి టిక్ టాక్ వీడియోలు చేసింది, ఆ వీడియో వైరల్ అయి మరో ముగ్గురిని కాటేసింది.
వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని ఫీనిక్స్ మాల్ లో పనిచేసే ఓ 25 ఏళ్ల యువతికి కొద్ది రోజుల కిందట కరోనావైరస్ లక్షణాలతో తమిళనాడు (Tamil Nadu) లోని అరియలూర్ (Ariyalur) ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెకు పాజిటివ్ అని రావడంతో ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సనందిస్తున్నారు. ఐసోలేషన్‌లో ఒంటరిగా ఉంటుంది కాబట్టి యువతి తన మొబైల్ ద్వారా వినోదం పొందటానికి అనుమతి ఉంది.
అయితే యువతి మాత్రం టిక్ టాక్‌లో రైజింగ్ స్టార్, 242 మంది ఫాలోవర్లు ఉన్నారు, ఇప్పుడిప్పుడే ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటుంది. ఇంతలోనే కరోనావైరస్ దెబ్బకు ఆసుపత్రిలో చేరింది. అయినా కూడా పట్టు వదలకుండా ఐసోలేషన్ వార్డ్ నుంచే టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. రోజుకో విషాదగీతంతో తనకు కరోనావైరస్ సోకిందని తన ఫీలింగ్స్ ఎప్పుడు, ఎలా ఉన్నాయో చెబుతూ "తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది" అనే రేంజ్‌లో వీడియోలు చేస్తుంది. అంతవరకూ బాగానే ఉన్నా, మూడు రోజుల కిందట ఐసోలేషన్ వార్డులను శుభ్రపరిచే ముగ్గురు శానిటేషన్ సిబ్బందిని తన వీడియోలలో భాగస్వామ్యం చేసింది, వారితో కూడా వీడియోలు షూట్ చేయించుకుంది. ఆ వీడియో కూడా కరోనావైరస్ స్పీడ్‌తో వైరల్ అయ్యాయి. అధికారుల దృష్టికి రావడంతో ఆ ముగ్గురు శానిటేషన్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా పేషెంట్‌తో సన్నిహితంగా మెలుగుతూ, ఆమె మొబైల్ ను పట్టుకున్నందుకు ఈ ముగ్గురిపై కూడా అనుమానం వచ్చి క్వారైంటైన్‌కు తరలించారు. భారతదేశంలో 1,637కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆసుపత్రి లోపల ఎలాంటి వీడియోలు తీయరాదని అరియలూర్ ఇంచార్జ్ హెల్త్ జేడీ జి తిరుమోల్ సీరియస్ అయ్యారు. ఇలాంటివి మరోసారి చేయొద్దని పేషెంట్‌ను హెచ్చరించారు.