Indian-Railway

Lucknow, Sep 11: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్-ఖేరీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రైల్వే ట్రాక్‌పై నిలబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరిస్తున్నారు. అయితే వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో భార్యాభర్తలు, వారి రెండేళ్ల కుమారుడు ఉన్నారు.

ఈ ఘటన ఖేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం లక్నో నుంచి పిలిభిత్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సీతాపూర్‌లోని లాహర్‌పూర్‌లోని మొహల్లా షేక్ సరాయ్‌లో నివసిస్తున్న ఒక జంట రైల్వే ట్రాక్‌పై రీలు చిత్రీకరిస్తున్నారు. మహ్మద్ అహ్మద్ (30), అతని భార్య నజ్మీన్ (24) తమ రెండేళ్ల కుమారుడు అక్రమ్‌ను ఒడిలో పెట్టుకుని రైల్వే బ్రిడ్జి దగ్గర రీల్స్ తీస్తున్నారు. అయితే రైలు వచ్చిందని వారు గమనించలేకపోయారు. వేగంగా వచ్చిన రైలు కింద పడి ముగ్గురు నుజ్జునుజ్జు అయ్యారు.

షాకింగ్ వీడియో ఇదిగో, 40 అడుగుల ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడు మృతి, కారణం ఏంటంటే..

ఇటీవల రీల్స్‌ సరదాతో మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి పొంగిపొర్లుతున్న డ్యామ్‌ గోడపైకి ఎక్కి రీల్స్‌ చేసేందుకు యత్నించాడు. ప్రమాదవశాత్తు జారి డ్యామ్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.