Rayudu's 'Retired' Hurt: బ్యాటు దించిన అంబటి రాయుడు! అవకాశాల కోసం ఎదురుచూసి చూసి లేచి పడిన ఓ క్రికెట్ కెరటం.
Ambati Rayudu Retires | Photo Credits: Getty Images

Cricket News: ఇండియాలో క్రికెట్ అంటే అదొక చదరంగం ఆటలాంటిది. జట్టులో చోటు దక్కాలన్నా, దక్కిన చోటును కాపాడుకోవాలన్నా కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. అంతకు మించిన ఓపిక, సహనం కలిగి ఉండాలి. లేకపోతే చదరంగంలో పావులలాగే అర్థాంతరంగా తమ క్రికెట్ జీవితాన్ని ముగించాల్సి ఉంటుంది. అంబటి రాయుడు (Ambati Rayudu) అందుకు ఉదాహరణ.

చాలా మంది ఆటగాళ్ళకు జాతీయ జట్టుకు ఆడాలని ఆశ ఉంటుంది. అందులోనూ ప్రపంచ కప్ కు ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్కరి కల. జట్టులో చోటు దక్కడం అనేది అంత తేలికకాదు, అది ఒక అంతుచిక్కని ప్రశ్న. ఒక్కోసారి మనకంటే ముందే మన జూనియర్లకు చోటు దక్కి మనకు దక్కకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆటగాళ్లు సెలెక్టర్లపై నోరు జారి మొత్తం జట్టు కూర్పునే విమర్శించేలా ఉండకూడదు. ఓపిక పడుతూ ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టాలి. ఇక్కడ ఎవరి భావోద్వేగాలకు విలువ ఉండదు. ఎవరూ నీ సమస్యను పట్టించుకోరు. ఒక ఆటగాడి స్థానాన్ని భర్తీచేయడానికి ఇక్కడ సెలెక్టర్లకు లెక్కలేనన్ని ఆప్షన్లు ఉంటాయి. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు సెలెక్టర్లదే ఆధిపత్యం. అలాంటి సమయంలో వారికి నోటితో కాకుండా ఆటతోనే బదులు చెప్పాలి. ఈరోజు ఉన్న సెలెక్టర్లు రేపు ఉండకపోవచ్చు, రేపటి రోజు నీకంటే మంచి ప్రత్యామ్నాయం వేరొకరు దొరకపోవచ్చు. క్రికెట్ లో ఎక్కువగా ఉపయోగించే 'తనదైన రోజు' అనేది ఒకటి ఉంటుంది.

ఎం.ఎస్ ధోనీ సైతం జట్టులోకి రావటానికి ముందు ఎంతో కష్టపడ్డాడు, తన తోటి వారు తన కళ్ళముందే క్రికెట్ ఆడుతుంటే ఒకదశలో తన క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి క్లిష్ఠ సమయంలో నుంచి జట్టులో చోటు సంపాదించిన ధోని జట్టులో తనకు తను ఒక గట్టి పునాదిని వేసుకొని ఒక దశలో సెలెక్టర్లనే శాసించే స్థాయికి ఎదిగాడు.

ఇక అంబటి రాయుడు విషయానికి వస్తే టీనేజీ వయసు నుంచే రాయుడు క్రికెట్లో ఎన్నో మెరుపులు మెరిపించాడు. ధావన్, రైనా, దినేష్ కార్తీక్, ఆర్పీ సింగ్ లాంటి ఆటగాళ్లున్న అండర్ 19 జట్టుకు రాయుడు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2004 అండర్ 19 ప్రపంచ కప్ లో జట్టును సెమీస్ వరకూ చేర్చాడు. అయితే వాళ్లందరూ 2005 లోనే వన్డే జట్టులో చోటు సంపాదించగా, రాయుడు మాత్రం 2013 లో తన తొలి వన్డే ఆడాడు.

సౌత్ నుంచి వచ్చే వారి పట్ల టీమిండియాలో చోటుపై వివక్షత లాంటి విమర్శలు ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో రాయుడి దూకుడు స్వభావమే అతడి అవకాశాలకు గండి కొడుతూ వచ్చిందని చెప్తారు. కొన్నిసార్లు బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు, అలాగే రాజకీయ అంశాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలో రాయుడు తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోకుండా ఇబ్బందుల పాలయ్యాడు.

2019 ప్రపంచ కప్ సెలెక్షన్ జరిగినప్పుడు కూడా తను ఎంపిక కాకపోవడం పట్ల సెలెక్టర్లపై తాను పరోక్షంగా చేసిన '3 D' కామెంట్ (3D tweet) నెగెటివ్ గా వెళ్లింది. ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో గాయపడిన ఆటగాళ్ల స్థానంలో స్టాండ్‌బై గా ఉన్న రాయుడిని పరిగణలోకి తీసుకోకుండా మరొకరిని తీసుకోవడంతో ఇక ఆశలు వదులుకున్నాడో లేక 'హర్ట్' అయ్యాడో తెలియదు కానీ, ఎవరూ ఊహించని విధంగా అన్ని క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ను ప్రకటించాడు. తన ఈ పరిస్థితికి గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, కైఫ్ లాంటి మాజీ క్రికెటర్ల నుంచి మద్ధతు లభించినప్పటికీ చాలా మందికి రాయుడి నిర్ణయం మరోసారి తొందరపాటు చర్యగా అనిపించింది.

ఇలా అంబటి రాయుడు తన క్రికెట్ జీవితంలో ఎన్నో రాజకీయాలు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ పడుతూలేస్తూ లేచిపడిన కెరటంగా మిగిలాడు.

జూన్ 03, 2019న తాను రిటైర్మైంట్ ప్రకటించిన నాటికి అంబటి రాయుడు గణాంకాలు ఈవిధంగా ఉన్నాయి.  (Source Wikipedia/espncricinfo)