U19 Asia Cup 2023 Final: అండ‌ర్ -19 ఆసియా క‌ప్ ,విజేత‌గా బంగ్లాదేశ్, సొంత గ‌డ్డ‌పై యూఏఈని ఓడించి ట్రోఫీ ద‌క్కించుకున్న బంగ్లా,  ఏకంగా 195 ప‌రుగుల తేడాతో ఘ‌న‌విజ‌యం
U19 Asia Cup 2023 Final (PIC@ Bangladesh Cricket X)

Dubai, DEC 17: గత పది రోజులుగా దుబాయ్‌ వేదికగా సాగిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) అండర్‌ – 19 ఆసియా కప్‌ ను బంగ్లాదేశ్‌ (Bangladesh) సొంతం చేసుకుంది. ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్స్‌లో (U-19 Asia Cup 2023 Final) బంగ్లాదేశ్‌.. యూఏఈని (UAE) చిత్తుగా ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగుల స్కోరు చేయగా ఛేదనలో యూఏఈ బ్యాటర్లు చేతులెత్తేశారు. 24.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. ఫలితంగా యువ బంగ్లా.. 195 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్‌ అషికర్‌ రెహ్మాన్‌ షిబ్లి (149 బంతుల్లో 129, 12 ఫోర్లు, 1 సిక్సర్‌) తో పాటు చౌదురి ఎండి రిజ్వాన్‌ (60), అరిఫుల్‌ ఇస్లాం (50)లు రాణించడంతో బంగ్లా భారీ స్కోరు చేసింది. యూఏఈ బౌలర్లలో అయ్మన్‌ అహ్మద్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

 

అనంతరం ఛేదనలో యూఏఈ అట్టర్‌ ప్లాప్‌ అయింది. ఆ జట్టులో ధ్రువ్‌ పరశర్‌ (40 బంతుల్లో 25 నాటౌట్‌, 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. అతడి తర్వాత అక్షత్‌ రాయ్‌ (11) మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరుచేశాడు. మిగిలినవాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో మరూఫ్‌ మృధ, రోహనత్‌ బోర్సన్‌లు తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో భాగంగా సెమీస్‌లో బంగ్లాదేశ్‌.. భారత్‌ను ఓడించగా యూఏఈ పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌ చేరిన విషయం విదితమే.