New Delhi, NOV 30: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ (Roger Binny) ఈ ఏడాది అక్టోబర్ 18న బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. బిన్నీ 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. తాజాగా 2023 వన్డే వరల్డ్ కప్‌ను గెలిచేందుకు టీమిండియా (Team ndia) మేనేజ్‌మెంట్ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే సెలక్షన్ కమిటీపై వేటువేసిన బీసీసీఐ, త్వరలోనే ఫార్మాట్ల వారిగా కెప్టెన్లను నియమించాలనే యోచనలో రోజర్ బిన్నీ (Roger Binny) కసరత్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ షాకిచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ (Vineet Saran) కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (conflict of interest) నోటీసులు అందజేశారు. అయితే, ఈ నోటీసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువుచేసేలా డిసెంబర్ 20లోగా బిన్నీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల (BCCI Matches) ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ (Mayanthi Launger) పనిచేస్తోంది. ఇది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా (Sanjeev Gupta) ఫిర్యాదు చేశాడు. గుప్తా ఫిర్యాదుపై స్పందించిన ఎథిక్స్ ఆఫీసర్.. వివరణ కోరుతూ బిన్నీకి నోటీసులిచ్చాడు.
నవంబర్ 21నే రోజర్ బిన్నీకి నోటీసులు జారీ చేస్తూ లేఖ రాశారు. అఫిడవిట్ ద్వారా డిసెంబర్ 20వ తేదీలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని బిన్నీకి శరణ్ సూచించారు. ‘బీసీసీఐ నిబంధనల్లోని రూల్ 39(2)(బీ) కింద మీపై ఫిర్యాదు అందిందని.. మీరు రూల్ (1) (i), రూల్ 38(2)ను ఉల్లంఘించారని’ శరణ్ తన నోటీసులో పేర్కొన్నారు.