అహ్మదాబాద్, ఫిబ్రవరి 4: టీమిండియాను కరోనా కేసులు భయపెడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ముందు ఈ కేసులు నమోదవుతుండటం కలవరానికి గురి చేస్తోంది. అంతేకాదు టీమిండియా ఈ నెల 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడు టీ20ల సిరీస్‌ని ఆడాల్సి ఉంది. టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌తో పాటు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి బుధవారం రాత్రి కరోనా పాజిటివ్‌గా తేలింది. అలానే జట్టులోని సపోర్ట్ స్టాఫ్‌లోనూ నలుగురు ఈ వైరస్ బారినపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు భారత టీ20 జట్టులోని స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.
గాయం కారణంగా ఇటీవల ముగిసిన భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కి దూరమైన అక్షర్ పటేల్.. భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్‌లో తప్పకుండా తుది జట్టులో ఉండేలా కనిపించాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో లేకపోవడంతో.. అక్షర్ పటేల్‌కి అవకాశం దక్కింది. కానీ.. కరోనా కారణంగా అతను టీ20 సిరీస్‌లో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అక్షర్ స్థానంలో ఎవరినీ భారత సెలెక్టర్లు ఇంకా టీ20 జట్టులోకి ఎంపిక చేయలేదు.