New Delhi, NOV22: వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఆడేందుకు సిద్ధంగా లేకపోవడంతో పాటు హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ససేమిరా అంటుండమే అందుకు కారణం. దాంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి నవంబర్ 11న జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఈవెంట్‌ను కూడా రద్దు చేసింది. అయినా సరే అటు బీసీసీఐ (BCCI), ఇటు పీసీబీలు పంతం వీడడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ అత్యవసర సమావేశం నిర్వహించాలి అనుకుంటోంది. చాంపియన్స్ ట్రోఫీ వేదిక ఖరారు చేయడమే కాకుండా దాయాది బోర్డులను ఒప్పించడమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగనుంది.
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరదించేందుకు ఐసీసీ (ICC) సిద్దమవుతోంది. నవంబర్ 26న జరుగబోయే అత్యవసర సమావేశంలో పీసీబీ, బీసీసీఐల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఐసీసీ ప్రతినిధులు ప్రయత్నించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఐదు అంశాలపై చర్చించే వీలుంది.
1. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎక్కడ జరపాలి? ఇతర గ్రూప్ మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహించాలి?
2. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను తటస్థ వేదికపై జరపడం.
3. పాక్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించని పక్షంలో ఏం చేయాలి?
4. చాంపియన్స్ ట్రోఫీని మొత్తానికే పాకిస్థాన్ నుంచి తరలించడం.
5. పాకిస్థాన్ జట్టు లేకుండానే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం.
చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్‌కు బీసీసీఐ (BCCI) షాకిచ్చింది. భద్రతా కారణాలరీత్యా పాక్ గడ్డకు జట్టును పంపబోమని ఐసీసీకి స్పష్టం చేసింది. ఇదే విషయాన్నిపీసీబీకి ఐసీసీ తెలియజేసింది కూడా. అయినా సరే తమకు రాత పూర్వక ఆధారం కావాలంటూ పీసీబీ మొండి పట్టు పడుతోంది.
అంతేకాదు ఐసీసీ సూచించినట్టు హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ అంగీకరించడం లేదు. పీసీబీ అలానే మొండికేస్తే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ సిద్దంగా ఉంది. అదే జరిగితే మెగా టోర్నీ ఆతిథ్యం కింద పీసీబీకి కేటాయించిన రూ.548 కోట్లు హుష్‌కాకి అయినట్టే.