India World Cup

New Delhi, OCT 22: వన్డే వరల్డ్ కప్ టోర్నీ -2023లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం (India beat Newzeland) సాధించింది. దీంతోపాటు పాయింట్ల పట్టికలోకి భారత్ టాప్ లోకి దూసుకెళ్లింది. 48 ఓవర్లలోనే న్యూజిలాండ్ విధించిన విజయ లక్ష్యాన్ని భారత్ చేదించింది. అంతకుముందు 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్లు దూకుడుగానే ఆడారు. 11 ఓవర్లలో 71 పరుగులు చేసిన తర్వాత ఫెర్గూసన్ బౌలింగ్ లో బౌల్డయి రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు.. రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ వెంటనే శుభ్ మన్ గిల్ నూ ఫెర్గూసన్ ఔట్ చేయడంతో జట్టు స్కోర్ ను చక్క దిద్దే బాధ్యత మరోమారు శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీపై పడింది.ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (Kohli), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కలిసి జట్టును విజయ పథంలో నడిపించారు. చివర్లో 95 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో.. రవీంద్ర జడేజా ఫోర్ తో విన్నింగ్ షాట్ కొట్టి జట్టును గెలిపించారు.

 

22వ ఓవర్ లో ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా పంపాడు శ్రేయాస్ అయ్యర్, కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కాన్ వే ముందుకు దూసుకొచ్చి క్యాచ్ పట్టాడు. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 33వ ఓవర్ లో శాత్నర్ వేసిన తొలి బంతికి కేఎల్ రాహుల్ ఎల్బీ డబ్ల్యూ అయితే, 34వ ఓవర్ లో బౌల్ట్ వేసిన ఐదో బంతిని కవర్ మీదుగా ఔట్ సైడ్ పంపిన సూర్య కుమార్ సకాలంలో క్రీజ్ కు చేరుకోలేకపోవడంతో సాత్నార్, టామ్ లేథమ్ రనౌట్ చేశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ బౌలర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు.