Pakistan Cricket Team (PIC@ PCB X)

Hyderabad, SEP 28: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ (ICC World Cup) ఆడేందుకు దాయాది పాకిస్థాన్‌ జట్టు (Pakistan Cricket Team).. భారత్‌లో అడుగుపెట్టింది. బాబర్‌ ఆజమ్‌ సారథ్యంలోని 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాకిస్థాన్‌ బృందం లాహోర్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇక పాకిస్థాన్ జ‌ట్టు హైదరాబాద్ (Hyderabad) చేరుకోగానే శంషాబాద్ ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం ప‌లికారు. అనంత‌రం కట్టుదిట్టమైన భద్రత మధ్య పాక్ ఆటగాళ్లను ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పార్క్ హయత్ హోటల్‌కు తరలించారు.

 

ఇదిలా ఉండ‌గా.. 2016 టీ20 ప్రపంచకప్‌ (World Cup) తర్వాత పాకిస్థాన్‌ టీమ్‌ ఇక్కడికి చేరుకోవడం ఇదే తొలిసారి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకుండా.. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతునున్నాయి. ప్రయాణానికి 48 గంటల ముందు పాక్‌ ప్లేయర్లకు భారత వీసా లభించగా.. తాజా జట్టులో మహమ్మద్‌ నవాజ్‌, సల్మాన్‌ అలీ తప్ప మిగిలిన వాళ్లందరికీ ఇదే తొలి భారత పర్యటన. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు పాకిస్థాన్‌ రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనుంది. అందులో తొలి మ్యాచ్‌ శుక్రవారం ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరగనుంది.