Lahore, SEP 06: సూపర్-4 దశలో పాకిస్తాన్ (Pakistan Won) మొదటి విజయాన్ని నమోదు చేసింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ (Bangladesh) నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్ (78; 84 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (63 నాటౌట్; 79 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్) అర్థశతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కు శుభారంభం దక్కలేదు. స్కోరు బోర్డు మీద ఒక్క పరుగు చేరకముందే నసీమ్ షా బౌలింగ్‌లో మెహిదీ హసన్ మిరాజ్ (0) డకౌట్ అయ్యాడు. పాక్ బౌలర్లు ధాటికి లిటన్ దాస్ (16), మహ్మద్ నయీమ్(20), తౌహిద్ హృదయ్ (2)లు తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో ఓ దశలో బంగ్లాదేశ్ 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Pakistan sign off their home leg of #AsiaCup2023 in style with a comfortable win over Bangladesh 💪
📝 #PAKvBAN: https://t.co/p8sERaWRSR pic.twitter.com/o8XCPK4bCk
— ICC (@ICC) September 6, 2023
ఈ దశలో సీనియర్ ఆటగాళ్లు అయిన ముష్ఫికర్ రహీమ్ (64; 87 బంతుల్లో 5 ఫోర్లు), షకీబ్ అల్ హసన్(53; 57 బంతుల్లో 7 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో 53 బంతుల్లో షకీబ్ అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే మరికాసేపటికే ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో 100 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
షకీబ్ ఔటైన ఓవర్‌లోనే ముష్ఫికర్ రహీమ్ రెండు పరుగులు తీసి 71 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. షకీబ్ ఔటైన తరువాత మరొసారి బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రఫ్, ఇఫ్తికార్ అహ్మద్ లు తలా ఓ వికెట్ తీశారు.