Rahul Dravid (Photo Credits: X/@ANI)

New Delhi, June 30: మ‌రోసారి టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను (T-20 World Cup) సొంతం చేసుకుంది. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును ఓడించి విశ్వ విజేత‌గా నిలిచింది. 17 ఏళ్ల త‌రువాత టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడంతో ఆట‌గాళ్లు, అభిమానులు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముగియ‌డంతో ప్ర‌ధాన కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ (Rahul Dravid) ప‌ద‌వి కాలం ముగిసింది. ఈ మ్యాచ్ అనంత‌రం ద్ర‌విడ్ (Rahul Dravid reacts) మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం త‌న‌కు మాట‌లు రావ‌డం లేద‌న్నాడు. ఈ జ‌ట్టును చూస్తుంటే గ‌ర్వంగా ఉంద‌న్నాడు. క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆట‌గాళ్లు చూసిన పోరాటం ఆక‌ట్టుకుంద‌ని చెప్పాడు. ఓ ఆట‌గాడిగా ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిచే అదృష్టం త‌న‌కు ద‌క్క‌లేద‌ని, అయితే.. ప్ర‌తి టోర్నీలోనూ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శన ఇచ్చేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా వివ‌రించాడు. కోచ్‌గా (Coach) ప్ర‌పంచ‌క‌ప్‌ను సాధించ‌డం త‌న అదృష్టంగా చెప్పాడు. ‘ఈ ట్రోఫీని గెలవడం నా అదృష్టం. ఇది గొప్ప అనుభూతి. ఇది గొప్ప ప్ర‌యాణం.’ అని ద్ర‌విడ్ అన్నాడు.

 

ద్ర‌విడ్ సార‌థ్యంలో 2007లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగింది. వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీలో భార‌త్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మొద‌టి రౌండ్‌లో నిష్ర్క‌మించింది. కానీ ద్రవిడ్.. జట్టు ప్రధాన కోచ్‌గా తన సహకారాన్ని తగ్గించడం వంటి పదాలు లేదా విమోచన వంటి వాటిపై తనకు నమ్మకం లేదని చెప్పాడు. త‌న‌కు తెలిసి ట్రోఫీని గెలవలేకపోయిన ఇంకా చాలా మంది ఆటగాళ్లు ఉన్నారన్నాడు. రోహిత్, ఈ బృందంతో కలిసి పనిచేయడం త‌న‌కు చాలా న‌చ్చింద‌న్నాడు. ఇది ఓ గొప్ప ప్ర‌యానం ప్ర‌యాణం అని ద్ర‌విడ్ చెప్పాడు. దీన్ని జీవిత‌కాలం గుర్తుంచుకుంటాన‌న్నాడు. సాధార‌ణంగా ద్ర‌విడ్ త‌న హావ‌భావాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డు. అయితే.. టీమ్ఇండియా విజ‌యం సాధించిన స‌మ‌యంలో ద్ర‌విడ్ ఎంతో ఉత్సాహంగా క‌నిపించాడు. త‌న భావోద్వేగాల‌ను చూపించాడు.

ఇక ఫైన‌ల్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా తొలుత‌ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లి (76), అక్ష‌ర్ ప‌టేల్ (47) లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో అన్రిచ్ నోర్జే, కేశ‌వ్ మ‌హ‌రాజ్ లు చెరో రెండు, మార్కోజాన్సెన్‌, ర‌బాడ‌లు చెరో వికెట్ తీశారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాప్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52). ట్రిస‌న్ స్ట‌బ్స్ (21 బంతుల్లో 31), క్వింట‌న్ డికాక్ (31 బంతుల్లో 39) రాణించినా స‌ఫారీల‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.