RCB Beat SRH by 35 Runs (PIC@ IPL X)

Hyderabad, April 25: ప‌దిహేడో సీజ‌న్‌లో రెండు సార్లు అత్య‌ధిక‌ స్కోర్ (RCB Beat SRH) బ‌ద్ధ‌లుకొట్టిన జ‌ట్టు.. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు ముచ్చెమ‌టు ప‌ట్టించిన విధ్వంస‌క‌ ఆట‌గాళ్లు.. స్వింగ్‌తో, స్పిన్‌తో అవ‌తలి వాళ్ల‌ను క‌ట్టడి చేసిన వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్లు.. స‌మిష్టిగా విఫ‌ల‌మైన రోజున స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sun risers Hyderabad) ఓ ప‌సికూన‌లా కుదేలైంది. సునామీ ఇన్నింగ్స్‌ల‌తో చ‌రిత్ర లిఖించిన ఆరెంజ్ ఆర్మీ యోధులంతా మేము ఆడ‌లేమ‌న్న‌ట్టు చేతులెత్తేయ‌గా.. సొంత స్టేడియంలో భారీ ఛేద‌న‌కు దిగిన హైద‌రాబాద్ 171 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. బ్యాటుతో బాదేసి, బంతితో చెల‌రేగిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bengaluru) క‌మిన్స్ సేనపై భారీ విక్ట‌రీ కొట్టింది. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన ఆర్సీబీ చిన్న‌స్వామిలో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకొని మెగా టోర్నీలో (RCB Beat SRH) రెండో విజ‌యం న‌మోదు చేసింది.

 

ఉప్ప‌ల్ స్టేడియానికి వెళ్లిన అభిమానుల‌కు వింత అనుభ‌వం ఎదురైంది. సినీ తార‌ల నుంచి స‌గ‌టు ప్రేక్ష‌కుడి వ‌ర‌కూ అంద‌రికీ ‘ఆడుతున్న‌ది స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లేనా?’ అన్న అనుమానం క‌లిగింది. బ‌ల‌మైన ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians), పంజాబ్ కింగ్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్, ఆర్సీబీల‌ను సొంత‌గ‌డ్డ‌పై మ‌ట్టిక‌రిపించిన హైద‌రాబాద్ ఈసారి పంజా విస‌ర‌లేక‌పోయింది. వ‌రుస‌గా ఏడు ఓట‌ముల‌తో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిన ఆర్సీబీ.. పోరాడితే పోయేదేమీ లేద‌న‌ట్టు ఆడ‌గా హిట్ట‌ర్లు ట్రావిస్ హెడ్(1), అభిషేక్ శ‌ర్మ‌(31), ఎడెన్ మర్క్‌ర‌మ్(7) క్లాసెన్‌(7)లు పేల‌వ షాట్ల‌తో ఆర్సీబీ బౌల‌ర్ల‌కు దాసోమ‌య్యారు. ఆర్సీబీ బ్యాట‌ర్లు విరాట్ కోహ్లీ(51), ర‌జ‌త్ పాటిదార్(50) అర్ద శ‌త‌కాల‌తో చెల‌రేగిన చోట‌.. మ‌నోళ్లు బౌండ‌రీల వ‌ర్షం కురింపించ‌లేక‌పోయారు.