Ravi Shastri (Photo Credits: Getty Images)

టీమిండియా ప్రధాన కోచ్ గా తిరిగి రవి శాస్త్రి నియామకం అయ్యారు. కోచ్ పదవి కోసం మొత్తం ఆరుగురు దరఖాస్తు చేసుకోగా, వీరిని ఆరుగురికి కపిల్ దేవ్, అన్షుమాన్ గైక్వాడ్ మరియు శాంత రంగస్వామిలతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) శుక్రవారం రోజున ఇంటర్వ్యూలకు ఆహ్వానించింది. ఈ కమిటీకి కపిల్ దేవ్ నేతృత్వం వహించారు. అభ్యర్థుల ఇంటర్వ్యూల అనంతరం రవి శాస్త్రి పేరును ప్రధాన కోచ్ పదవికి సిఫారసు చేస్తూ బీసీసీఐ పాలక మండలికి త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసింది.

ఈ మేరకు 2021 నవంబర్ 24 (టీ-20 ప్రపంచ కప్) వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా రవి శాస్త్రి వ్యవహరించనున్నారు. కాగా, ఈ కోచ్ రేసులో మైక్ హెస్సన్ రెండవ స్థానంలో, టామ్ మూడీ మూడవ స్థానంలో నిలిచారు. అంతకుముందు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం రవిశాస్త్రికే బహిరంగంగా తన మద్ధతు ప్రకటించాడు. కోహ్లీ ప్రభావంతోనే రవిశాస్త్రి తిరిగి నియామకం కాబడ్డారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే విదేశీ కోచ్ ఉండటం కంటే ఇండియాకు చెందిన వారైతేనే మంచిదని కమిటీ అభిప్రాయపడింది, అందుకే రవి శాస్త్రిని ఎంపిక చేశాం. ఈ ఎంపికలో కోహ్లీ ప్రభావం ఎంతమాత్రం లేదని సిఎసి స్పష్టం చేసింది.

కోచ్ పదవి కోసం రవి శాస్త్రితో ఫిల్ సిమన్స్, హెస్సన్, మూడీ, రాబిన్ సింగ్ మరియు లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు అయితే ఫిల్ సిమన్స్ తనకు తానుగా రేసు నుంచి తప్పుకున్నారు.

ఇక మరో అభ్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ గతంలో 2017లో కూడా తిరస్కరించబడ్డారు. శాస్త్రి కోచ్ గా ఉన్న కాలంలో ఆయన ట్రాక్ రికార్డ్ కూడా బాగా పనిచేసింది. అనిల్ కుంబ్లే తర్వాత 2017 జూలై నెలలో టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలు రవి శాస్త్రి చేపట్టారు. ఆయన నేతృత్వంలో టీమిండియా 71 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై గెలుస్తూ వరుస సిరీస్ లను కైవసం చేసుకుంది. టెస్టుల్లో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 2019 వరల్డ్ కప్ మినహా, టెస్టులు, వన్డేలు, టీ20లలో వరుస సిరీసులు గెలుస్తూ ఆడిన వాటిలో దాదాపు 80 శాతం మ్యాచ్ లను టీమిండియా గెలిచింది. ఇప్పుడు 2021 వరకూ మళ్ళీ రవి శాస్త్రినే కొనసాగుతున్నాడు కాబట్టి, రెండవ టర్మ్ లో టీమిండియా విజయాల కోసం ఎలాంటి కృషి చేస్తాడో చూడాలి.

ఇదిలా ఉండగా, రవి శాస్త్రి నియామకంపై విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా విపరీతంగా జరుగుతుంది. ఈ కోచ్ ఎంపికలో ఎలాంటి ఆశ్చర్యం ఎవరికీ కలుగలేదు. రవిశాస్త్రినే కొనసాగుతాడని అందరికీ తెలుసు ఇంకా ఈ సెలక్షన్ డ్రామాలు ఎందుకో అని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా అయితే ఈ ఎంపిక పట్ల ఒక ఆట ఆడుకుంటుంది.