New Delhi, SEP 09: ఆసియా కప్ (Asia cup) సందర్భంగా గాయపడిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. అయితే, ప్రాక్టీస్ చేస్తుండగా జడేజా గాయపడ్డాడని అంతా అనుకున్నారు. ఆ గాయానికి సర్జరీ కూడా జరగడంతో గాయం తీవ్రమైనదే అని అందరికీ అర్థమైంది. అయితే ఆ గాయం ఎలా తగిలిందో ఇప్పుడు వెల్లడైంది. అంతేకాదు, గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టనుండడంతో, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ( Australia) జరిగే టీ20 వరల్డ్ కప్ కు కూడా జడేజా దూరమయ్యాడు. ఆసియా కప్ సందర్భంగా టీమిండియా దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్ లో బస చేసింది. దుబాయ్ సముద్ర జలాల్లో జలక్రీడలకు వెళ్లిన జడేజా తీవ్రంగా గాయపడ్డాడు.
Speedy Returns, Jaddu! More Power to you. 🥳💪🏻#Yellove #WhistlePodu 🦁💛 @imjadeja pic.twitter.com/GAeZZHEDAM
— Chennai Super Kings (@ChennaiIPL) September 6, 2022
అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ లో స్కీబోర్డ్ (Skeboard) జలక్రీడను ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన జడేజాకు మోకాలుకు దెబ్బ తగిలింది. ఆ గాయం తీవ్రమైనది కావడంతో జడేజా ముంబై వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
జడేజా తీరుపై బీసీసీఐ (BCCI) సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఆసియా కప్ జరుగుతుండగా, మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ఉండగా, అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ లో పాల్గొనేందుకు వెళ్లడం అవసరమా? అంటూ బోర్డు వర్గాలు అతడిపై మండిపడ్డాయి. టీమిండియాలో ఎంతో కీలకమైన ఆటగాడు నిర్లక్ష్యపూరితంగా జలక్రీడలకు వెళ్లడం ఏంటని తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గ్రూప్ దశలో సాధించిన విజయంలో జడేజాది కీలకపాత్ర. ఆ తర్వాత అతడు జట్టుకు దూరం కాగా, టీమిండియా కూడా పరాజయాల బాటలో పయనించి టోర్నీ నుంచి నిష్క్రమించింది.