Newdelhi, October 30: అశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే! టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) భాగంగా నేడు భారత్-దక్షిణాఫ్రికా (India-South Africa) మధ్య మ్యాచ్ (Match) జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) విజయం సాధించాలని పాక్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే, ఇందుకో కారణం కూడా ఉంది. సూపర్-12 (Super-12) ఆరంభ మ్యాచ్‌లో ఇండియా చేతిలో ఓడిన పాకిస్థాన్, ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. దీంతో గ్రూప్-2లో చివరి నుంచి రెండో స్థానానికి పడిపోయిన పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు మెరుగుపడాలంటే భారత జట్టు తన తదుపరి మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అదే జరిగితే పాక్‌కు ఆశలు చిగురిస్తాయి.
పాకిస్థాన్ ఇంకా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లోనూ అది విజయం సాధించినా సెమీస్‌కు చేరడం కష్టమే. బాబర్ సేన సెమీస్‌కు చేరుకోవాలంటే భారత జట్టు నేడు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తోపాటు జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపైనా విజయం సాధించాలి. అప్పుడు ఆయా జట్ల సెమీస్ అవకాశాలకు గండి పడుతుంది. ఇది పాకిస్థాన్‌కు వరంగా మారుతుంది. కాబట్టే భారత్ తలపడే మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు, పాక్-నెదర్లాండ్స్ మధ్య నేడు పెర్త్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కనుక పాకిస్థాన్ ఓడితే ఇక ఇంటికెళ్లిపోవడం ఖాయం.