
New Delhi, SEP 15: టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా (Team India) ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో (IND Vs BNG) జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంటుంది. టెస్ట్‌ల్లో ఇప్పటి వరకు కేవలం నాలుగు జట్లు మాత్రమే పరాజయాల కంటే ఎక్కువ విజయాలు సాధించాయి. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఈ రికార్డు సాధించిన ఐదో జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుతుంది (historic record). భారత్ ఇప్పటివరకు 579 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 178 విజయాలు, 178 పరాజయాలను ఎదుర్కొంది. మిగతా 223 మ్యాచ్‌ల్లో 222 డ్రా కాగా.. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
బంగ్లాపై తొలి టెస్ట్‌లో (1st Test) గెలిస్తే భారత్ విజయాల సంఖ్య పరాజయాల సంఖ్య కంటే ఎక్కువుతుంది. చరిత్రలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ మాత్రమే పరాజయాల కంటే ఎక్కువ విజయాలు సాధించాయి. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 866 టెస్ట్‌లు ఆడి 414 విజయాలు, 232 పరాజయాలు ఎదుర్కొంది. ఇంగ్లండ్ ఇప్పటివరకు 1077 మ్యాచ్‌లు ఆడి.. 397 విజయాలు, 325 పరాజయాలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 466 టెస్ట్‌లు ఆడి 179 విజయాలు, 161 పరాజయాలు ఎదుర్కొంది. పాకిస్తాన్ ఇప్పటివరకు 458 టెస్ట్‌లు ఆడి 148 విజయాలు, 144 పరాజయాలు ఎదుర్కొంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. భారత ఆటగాళ్లంతా చెన్నైలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.