Australia Beat Pakistan (PIC@ ICC X)

Bangalore, OCT 20: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా పుంజుకుంటోంది. మొద‌టి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా (Australia) ఆ త‌రువాత వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 62 ప‌రుగుల తేడాతో (Australia Beat Pakistan ) విజ‌యం సాధించింది. 368 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్ (Pakistan) 45.3 ఓవ‌ర్‌లో 305 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో ఇమామ్ ఉల్ హక్(70; 71 బంతుల్లో 10 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (64; 61 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా నాలుగు వికెట్ల‌తో పాక్ ప‌త‌నాన్ని శాసించాడు. స్టోయినిస్, క‌మిన్స్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. హేజిల్ వుడ్, స్టార్క్‌ ఒక్కొ వికెట్ తీశారు.

 

అంత‌కు ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 367 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (163 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స‌ర్లు), మిచెల్ మార్ష్ (121 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) సెంచరీలతో చెలరేగారు. వార్నర్, మార్ష్ జోరు చూస్తే ఆసీస్ ఓ ద‌శ‌లో 400 పరుగులు దాటుతుందని అనుకున్నారు. అయితే.. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన వారు విఫ‌లం కావ‌డం, పాకిస్థాన్ బౌలర్లు పుంజుకోవ‌డం అనుకున్న‌దానికంటే త‌క్కువ స్కోరుకే ఆసీస్ పరిమిత‌మైంది. పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ ఆఫ్రిది ఐదు వికెట్లు తీశాడు. హరీస్ రవూఫ్ 3 వికెట్లు ఉసామా మీర్ ఒక వికెట్ పడగొట్టాడు.