Gowda Faster Than Bolt: ఉసేన్ బోల్ట్ కంటే వేగం మన ఈ మట్టిలో మాణిక్యం, సాంప్రదాయ కంబాల పోటీదారు 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలోనే పూర్తి చేసి రికార్డ్
Srinivasa Gowda (Photo Credits: Twitter)

జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ (Usain Bolt) గురించి అందరూ వినే ఉంటారు. పరుగు పందెంలో చిరుతకంటే వేగం అతడి సొంతం. ఏ అంతర్జాతీయ రేసులలో అయినా మరియు స్ప్రింట్లను గెలవడంలో అయినా ఉసేన్ బోల్ట్‌ను ఓడించేవారే లేరు. చాలా సందర్భాల్లో బోల్ట్ 100 మీటర్లను కేవలం 9.58 సెకన్లలో చుట్టేసే రికార్డును కలిగి ఉన్నాడు. మరి ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తేవారు ఎవరూ ఉండరా? అంటే చెప్పలేం, ఉండొచ్చు, మన మధ్యే ఒక సాధారణ మనిషిలా తిరుగుతుండొచ్చు, అలా వెలుగులోకి రాని మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉండొచ్చు. కానీ సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేక ఎందరో ఉసేన్ బోల్ట్ లు మన ఊర్లల్లో ఏ గేదేలు కాసుకుంటునో, ఏవో కూలీ పనులు చేసుకుంటూనో ఉండిపోయి ఉంటారు.

అలాంటి ఓ మట్టిలో మాణిక్యాన్ని మీకిప్పుడు పరిచయం చేస్తున్నాం. దక్షిణ కన్నడకు చెందిన సాంప్రదాయ కంబాల (Kambala Sport)  పోటీదారు శ్రీనివాస గౌడ (Srinivasa Gowda), ఎద్దుల పోటీలో భాగంగా తనకు తెలియకుండానే ఏకంగా 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలోనే పూర్తిచేశాడు, అది కూడా బురదనీటిలో. దీని ప్రకారం అతడు 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలోనే అందుకున్నాడు, అంటే ప్రపంచ ఛాంపియన్ ఉసేన్ బోల్ట్ అత్యుత్తమ ప్రదర్శన కంటే కూడా ఉత్తమం అని.

కంబాల అనేది అనేది దక్షిణకన్నడ, ఉడుపి, తుళునాడు పశ్చిమ తీర ప్రాంతంలో వార్షికంగా నిర్వహించే ఒక క్రీడ. ఇందులో 'బఫెలో జాకీ' లేదా ఎద్దుల పోటీదారుడు, రెండు ఎడ్లను బురదనీటిలో ఎవరైతే వేగంగా, తొందరగా పరుగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారిని విజేతలో ప్రకటించడం ఈ క్రీడలో జరిగే తంతు. కర్ణాటకలో వ్యవసాయం చేసే 'గౌడ' సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో పాల్గొనటం ఎప్పట్నించో ఉంది.

ఈ క్రీడలో ప్రస్తుతం కర్ణాటకలో 'బాహుబలి' గా కీర్తించబడుతున్న శ్రీనివాస గౌడ ఇప్పటివరకు 12 కంబాల పోటీల్లో 29 బహుమతులు పొందాడు. తాజాగా ఈ 28 ఏళ్ల యువకుడు బెల్తాంగడి సమీపంలోని అలడంగడిలో జరిగిన పోటీలో గెలవడం ద్వారా కంబాల క్రీడ చరిత్రలో 30 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. అతడి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఆపై స్థానిక మీడియా ఇప్పుడు జాతీయ మీడ కూడా శ్రీనివాస గౌడ సాధించిన రికార్డును ప్రశంసిస్తున్నాయి.

ఇక ఈ శ్రీనివాస గౌడ విషయానికి వస్తే, 5వ తరగతిలోనే చదువు ఆపేసిన ఇతడు ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత ఐదారేళ్లుగా కంబాల పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాడని, ఓ ఇద్దరి యజమానుల వద్ద పనిచేస్తూ వారికి సంబంధించిన మూడు ఎద్దుల జోడిలకు శ్రీనివాస్ జాకీగా వ్యవహరిస్తున్నాడు.