Vjy, April 1: మచిలీపట్నంలో వాలంటీర్ల (Volunteers) మూకుమ్మడి రాజీనామాలు చేశారు.రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్‌కి అందజేశారు.పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఈసీ (EC) దూరం పెట్టింది. దీంతో వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్‌కు.. అలాగే గ్రామ సచివాలయాల్లోనూ రాజీనామాలను అందస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1200 పైబడి వాలంటీర్లు సేవలందిస్తున్నారు.
వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలచివేసిందని తెలిపారు. తమ దగ్గర్నుంచి మొబైల్ సిమ్స్, డివైస్‌లు తీసేసుకున్నారని చెప్పారు. ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని, తాము ఎవరిదగ్గర డేటా సేకరించామో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమను ఎన్నో రకాలుగా అవమానించినా భరించామని అన్నారు. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. విజయవంతంగా నాలుగో రోజు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ...సీఎం జగన్ తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న తుగ్గులి, రాతన గ్రామ ప్రజలు
ఉదయం నుంచి తమకు వృద్ధులు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులకు అందిస్తూ గత 50 నెలలుగా నిస్వార్ధ సేవలందిస్తున్నామన్నారు. ఎటువంటి రాజకీయాలకూ ప్రభావితం కాకుండా సేవలందిస్తున్నామని తెలిపారు.
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై కమిషనర్ బాపిరాజు స్పందించారు. మచిలీపట్నంలో వార్డు వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలను పరిశీలిస్తున్నామన్నారు. నగర పాలక సంస్థలో 823 మంది వాలంటీర్ల పోస్టులు ఉండగా.. అందులో 10 - 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 430 మంది నుంచి రాజీనామాలు అందాయని తెలిపారు. రాజీనామాలన్నింటినీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని బాపిరాజు వెల్లడించారు.
వాలంటీర్లతో సామాజిక పింఛన్లు పంపిణీ చేయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల విధుల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలని మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ కార్యక్రమం నుంచి దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు వెల్లడించారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు, పింఛన్, నగదు పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం సీఈవోకు పంపిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్‌తో పాటు ఇతర ఉపకరణాలు కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయించాలని ఈసీ ఆదేశించినట్లు మీనా తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలను, నగదు పంపిణీ పథకాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు చేయాలని ఈసీ సూచించినట్లు వెల్లడించారు. నగదు పంపిణీలో వలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ(సీఎఫ్డీ) పిటిషన్ వేసింది.