ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. నాలుగో రోజు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గులి, రాతన గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించారు. అలాగే లబ్ధిదారులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను, సూచనలు స్వీకరించారు. పింఛన్ కోసం పడిగాపులు లేవని కొందరు, సొంత ఇంటి కల నెరవేరిందని పలువురు, ఆరోగ్యశ్రీతో ఆరోగ్యం మెరుగుపడిందని మరికొందరు ఇలా వారి స్వీయ అనుభవాలను సీఎం వైయస్ జగన్‌తో పంచుకున్నారు.
మన ప్రభుత్వం రాకమునుపు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో 4సం.ల 10 నెలలు పెన్షన్ - రూ.1000. మీ బిడ్డ హయాంలో పెన్షన్ రూ.2 వేల నుండి రూ.3వేలకు పెంచుకుంటూ వెళ్లాం. దేశం మొత్తంలోనే మూడు వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఇంకొక్కటి లేదు. మన రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయిలు. మన తర్వాత మిగతా రాష్ట్రాలు - రెండో స్థానంలో తెలంగాణా 12వేల కోట్లు, మూడు, నాలుగు స్థానాల్లో 8వేల కోట్లు, 6 వేల కోట్లు, 4వేల కోట్లు, పెన్షన్ చూస్తే రూ.500, పక్కన ఒడిస్సాలో, ఉత్తర ప్రదేశ్ లో కూడా కేవలం రూ.500. ఒక్క మన ప్రభుత్వంలోనే అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మల మీద ప్రేమ, అభిమానం చూపిస్తూ 66లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. గతంలో రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 33 లక్షలు మాత్రమే. మనం ఇస్తున్న 66 లక్షల పెన్షన్లలో 45 లక్షలు నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలే. ఇది గుర్తించమని కోరుతున్నానని సీఎం జగన్ అన్నారు.
చంద్రబాబుకు సవాల్ చేసిన అంధుడు
నీ ఓదార్పు యాత్ర మొదలు నేటి మేమంతా సిద్ధం యాత్ర వరకూ 100 కార్యక్రమాల్లో నే పాల్గొన్నాను అన్నా. పోలీసులు అడ్డుపడ్డా సరే ఆగలేదు. నాకు కళ్లు లేవు అయినా నీ కళ్లతోనే నేను చూస్తున్నాను అని భావిస్తున్నాను. ఒక్కసారి నిన్ను తాకాలని ఆశపడుతున్నాను. ఇక మా నియోజకవర్గం శింగనమలకు ఓ టిప్పర్ డ్రైవర్‌ను అభ్యర్థిగా పెట్టారని చంద్రబాబు అంటున్నాడు. టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? అని అడుగుతున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న టిప్పర్ డ్రైవర్‌కి చంద్రబాబు భయపడుతున్నాడు అంటే మా వీరాంజనేయులు గెలుపు ఖాయం అయినట్టే అని చెబుతున్నా. నాకు కనిపించదు. కానీ బాబుకు కనిపిస్తుంది కదా.,.. చంద్రబాబూ...నువు చూడు.... రేపు శింగనమలలో జూన్ 4వ తారీకున గెలిచి, జెండా ఎగరేసి, జగనన్నకు నేనే స్వయంగా స్వాగతం పలుకుతాను.
మీ సాయం మరువలేం జగనన్నా - బలరాం నాయక్, లక్ష్మి తాండ, తుగ్గలి, దివ్యాంగుడు
అన్నా నేను ట్రాన్స్ కోలో పనిచేసేవాడిని. ఒక ప్రమాదంలో పైనుంచి పడి నడుం విరిగింది. డ్రోన్ సభలో నన్ను పిలిచి మీరు ఐదు లక్షలు సహాయం అందించారు. మా నాన్నకు 3వేలు పెన్షన్ అందిస్తున్నారు. మీ మేలు మరిచిపోలేను. మిమ్మల్ని చూసేందుకే నా కుటుంబం అంతా ఇక్కడకు ఉదయం 6 గంటలకే వచ్చి ఎదురు చూస్తున్నాం.
పేదవాడికి పెద్ద వైద్యం ఆరోగ్యశ్రీతోనే సాధ్యం - జనార్థన్ రెడ్డి, చెన్నంపల్లి గ్రామం, ఔకు మండలం, నంద్యాల జిల్లా
రెండేళ్ల క్రితం మా నాన్నగారికి రెండు కిడ్నీల్ ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ చేయాలని చెప్పారు. నంద్యాల, కర్నూల్ లో పెద్ద హాస్పటల్ అనడంతో గౌరీగోపాల్ హాస్పటల్ లో డయాలసిస్ చేయించుకోమన్నారు. ఆ ఆసుపత్రి పేరు ఎందుకు చెబుతున్నామంటే ఎంతో డబ్బు ఉంటేనో, బాగా పెద్దవాళ్లు అయితేనో మాత్రమే అక్కడ వైద్యం చేయించుకోగలరు అంటారు. అలాంటి ఆసుపత్రిలో మా నాన్నకు డయాలసిస్ జరిగింది. అది ఆరోగ్యశ్రీ వల్లే సాధ్యం అయ్యింది. దాని తర్వాత మా నాన్నకు కిడ్నీ మార్పిడి చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కరూపాయి ఖర్చు లేకుండా చేయించుకోగలిగాం. ఆరోగ్య శ్రీ తరఫున అధికారులు మాకు వెన్నంటి ఉండి ఎంతో సాయం చేసారు. మీరు మా ఇంటి పెద్దగా మాకు అన్నీ చేసారు. అందుకే మిమ్మలన్నే మా పెద్దన్నగా భావిస్తున్నాను.