monkeypox RT-PCR kit (photo-AP MedTech Zone)

Vjy, August 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను సాధించింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను అందించిన మెడ్‌టెక్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది. తమ భాగస్వామ్య ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో కలిసి ఎర్బాఎండీఎక్స్ మంకీపాక్స్ ఆర్‌టీ – పీసీఆర్ పేరుతో ఈ కిట్‌ను అభివృద్ధి చేసింది.  దక్షిణ ఈయూ దేశాలను వణికిస్తున్న ‘గోట్ ప్లేగ్’ వ్యాధి.. మనుషులకు సోకే ప్రమాదం ఉందా??

ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదేనని శనివారం మెడ్‌టెక్ ప్రకటించింది. ఈ కిట్ కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్), సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీవో) నుండి అత్యవసర అంగీకారం లభించినట్లు సంస్థ ప్రకటించింది. ఆరోగ్య రంగంలో మన దేశ ప్రతిభకు ఇదే తార్కాణమని మెడ్‌టెక్ సీఈవో జితేంద్ర శర్మ తెలిపారు. రెండు వారాల్లో ఈ కిట్ ను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

కొవిడ్‌ విపత్తు సమయంలో మెడ్‌టెక్‌ జోన్‌ ఆరోగ్యరంగానికి అవసరమైన అనేక ఆవిష్కరణలు చేసింది. రోజుకు ఒక మిలియన్‌ ఆర్టీపీసీఆర్‌ కిట్లు, 500 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 100 వెంటిలేటర్లు ఇక్కడ తయారయ్యాయి.