Vijayawada, Nov 29: ఏపీకి (AP) తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదు. నేడు సాయంత్రానికి ఆ వాయుగుండం బలహీన పడుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్ , మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ గజగజ
అటు తెలంగాణలో చలి రోజురోజుకు పెరుగుతుంది. దీంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. కొన్నిచోట్ల రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల వరకూ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. పగటి వేళ కూడా అత్యల్పంగా 20 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.