Vizag Steel Plant (photo-File Image)

New Delhi, JAN 16: ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌-(Vizag steel plant) పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం విశాఖ స్టీల్‌ ప్లాంట్ ఆర్థికంగా, నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు భారీగా సాయం అందించాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్‌ (Central Cabinet) సమావేశంలో స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై చర్చ జరిగింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచారం. రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ను (Vizag Steel Plant) నడిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి (Kumara Swamy) శుక్రవారం వెల్లడించే అవకాశముంది. ఇటీవల సీఎం చంద్రబాబు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసినప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీ అందించాలని కోరిన విషయం తెలిసిందే. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటు పరం కాదని గతంలోనే కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ మార్గాలపై పలుమార్లు మంత్రిత్వశాఖ చర్చలు జరిపింది.

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం 

నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పనిచేస్తుండడమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం అంచనాకు వచ్చింది. దీంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో కార్మికుల ఆశలు చిగురించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం సిద్ధం కావడంతో.. ప్రత్యేక ప్యాకేజీ విధివిధానాలు ఎలా ఉంటాయన్న అంశంపై కార్మిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.