Vijayawada, October 22: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుపాను (సిత్రాంగ్)గా (Sitrang) మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ (IMD) వెల్లడించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. ఈ తుపాను ఈశాన్య దిశగా పయనిస్తూ, ఒడిశా (Odisha) తీరాన్ని దాటి, పశ్చిమ బెంగాల్ (West Bengal), బంగ్లాదేశ్ (Bangladesh) తీరాలను సమీపిస్తుందని వివరించారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ తుపాను ఏపీపై స్వల్ప ప్రభావం చూపుతుందని అంబేద్కర్ వెల్లడించారు. అయినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, తుపాను ప్రభావం ఉండొచ్చని భావిస్తున్న 105 మండలాల అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఆయా మండలాల్లో యంత్రాంగాన్ని సంసిద్ధం చేశామని వివరించారు.
తుపాను నేపథ్యంలో, మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లరాదని అంబేద్కర్ స్పష్టం చేశారు. ప్రజలు తుపాను ప్రభావాన్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర సహాయం, తుపాను సమాచారం కోసం 1070, 1800 4250101, 0863 2377118 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.