Tirumala, SEP 21: తిరుమలలో సోమవారం శాంతి హోమం నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతిహోమం, పంచగవ్యప్రోక్షణ చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. తిరుమలలో (Tirumala) ఆగస్టు 15న జరిగిన తప్పునకు యాగం చేశారన్నారు. చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీకి మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. జగన్ ఎంతో అపచారం చేసి.. దాన్ని సమర్థించుకుంటున్నారన్నారు. నిన్నటి నుంచి ఒక్కొక్క స్టేట్‌మెంట్ చూస్తుంటే కడుపు రగిలిపోయి ఆవేశం వస్తుందన్నారు.
సీఎంగా ఉన్న వరకు మతసామరస్యం కాపాడడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటున్నారని.. ఎదురు దాడి చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం (YSRCP) హయాంలో 3.75లక్షల వీఐపీ టిక్కెట్లు ఇచ్చారన్నారు. తిరుమల ప్రక్షాణళకు దేవుడు తనకొక అవకాశం ఇచ్చారని శ్యామలరావుకి చెప్పి.. అందుకనుగుణంగా పని చేయాలని ఈవోగా నియమించామని వివరించారు. లడ్డూ నాణ్యతపై అనుమానంతోనే నాలుగు ట్యాంకర్లలో నెయ్యి శాంపిల్స్‌ను ఎన్‌డీడీబీకి పంపామని.. ల్యాబ్‌లో పరీక్షల తర్వాత ఎస్ వేల్యూస్‌లో భారీ వ్యత్యాసాలు వెలుగు చూశాయని చెప్పారు. ఈవో సదరు సంస్థలకు నోటీసులు ఇచ్చి, బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్నారు. చర్యల కోసం నిపుణుల కమిటీ కూడా వేసి మళ్లీ టెండర్లు పిలిచారన్నారు. అక్రమాలపై ఐజీ, ఆపైస్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని, సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. స్వామివారి పవిత్రతను ఎవరు మలినం చేయలేరని.. ప్రక్షాళన చసి తిరుమలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు.