Vijayawada, SEP 21: టీటీడీలో శ్రీవారి లడ్డూ (Tirumala laddu) తయారీలో కల్తీ పదార్థాల వాడారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై నివేదిక సమర్పించాలని టీటీడీ ఈఓ జే శ్యామలరావును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఆదేశించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈఓ శ్యామలరావు (TTD EO J Syamala Rao) శనివారం నివేదిక అందజేశారు. టీటీడీ అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. టీటీడీ ఈఓ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై ఈ సమావేశంలో చర్చించారని తెలుస్తున్నది.
టీటీడీలో లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం విషయమై టీటీడీ (TTD) అధికారులు ఆదివారం మరింత సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు అందజేస్తారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయమై వచ్చిన సూచనలను కూడా ఈఓ జే శ్యామలరావు వివరించారు. ఈ విషయమై ఆగమ సలహాదారులు, అర్చకులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన సలహాలను సీఎం చంద్రబాబుకు దృష్టికి ఈఓ శ్యామలరావు తెచ్చారు. మరిన్ని విస్తృత సంప్రదింపుల తర్వాతే శ్రీవారి ఆలయ సంప్రోక్షణ జరుపాలని, టీటీడీ పవిత్రతను పరిరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.