Warangal, Feb 19: మేడారం మహా జాతర (Medaram) ముగిసింది. నాలుగు రోజుల పాటూ అంగరంగ వైభవంగా సాగిన జాతర....చివరి రోజు దేవతల వనప్రవేశంతో సమాప్తమైంది. గద్దెల వద్ద గిరిజన పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం గద్దెల వద్ద నుంచి డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవార్లు సమ్మక్క(Sammakka), సారలమ్మ(Sarakka), పగిడిద్దరాజు(Pagididda raju), గోవిందరాజులు (Govindarajulu) వన ప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క తల్లి, కన్నెపల్లికి సారలమ్మ తల్లి, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు, ఏటూరు నాగారం కొండాయికి గోవిందరాజులు చేరుకోనున్నారు. వనదేవతల వనప్రవేశం వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా.. గురువారం సమ్మక్క తల్లి కొలువు దీరింది. నలుగురూ గద్దెలపై ఆశీనులవడంతో శుక్రవారం వనదేవతల నిండు జాతరకు జనం పోటెత్తారు.
నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం మహాజారతకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఏడాది దాదాపు కోటీ 30 లక్షల వరకు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా వేస్తున్నారు. లక్షల మంది సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని బంగారం సమర్పించారు. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. జంపన్నవాగు తీరమంతా భక్త ప్రవాహమైంది.