File (Video Grab)

Hyderabad, Nov 19: ఎమ్మెల్యే కొనుగోలు కేసు వ్యవహారంలోని నలుగురు టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (Beeram Harshavardhan Reddy), రేగ కాంతారావు (Rega Kantha Rao), గువ్వల బాలరాజు (Guvvala Balaraju) నేడు బయటకు రానున్నారు. మూడు వారాలుగా ప్రగతి భవన్‌కే (Ptragathi Bhavan) పరిమితమైన వీళ్ళు ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. ఈ విషయాన్ని రోహిత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. 22 రోజులుగా ప్రగతి భవన్‌లో ఉంటున్న వారిని మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి తీసుకెళ్లి అక్కడి ప్రజలకు వారిని పరిచయం చేశారు. కాగా, ఇన్ని రోజులుగా వారు ప్రగతి భవన్‌కు పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే,  రక్షణ కోసమే తాము ప్రగతి భవన్‌లో ఉన్నట్టు ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.

కృష్ణ మృత్యువుతో పోరాడుతున్న సమయంలోనూ ఓ చిన్నారిని ఆదుకున్న మహేశ్ బాబు.. క్లిష్ట సమయంలోనూ వెంటనే స్పందించి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయించిన వైనం

మరోవైపు, మూడు వారాలుగా ఎమ్మెల్యేలు కనిపించకపోవడంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తాండూరు, కొల్లాపూర్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ఆ పార్టీ నాయకులు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహిత్‌రెడ్డి కనిపించకపోవడంతో  ఆయనను గెలిపించిన ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ప్రగతి భవన్ నుంచి ఆయనకు విముక్తి కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తాండూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి కనిపించడం లేదంటూ టీపీసీసీ సభ్యుడు రంగినేని అభిలాషరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.