Khammam, June 16: గుండె కుడి వైపు ఉందని పెళ్లయిన 16 రోజులకే భార్యను వదిలేశాడు ఓ ప్రబుద్ధుడు. ఇదేంటని బాధితురాలితో పాటు పెద్దలు ప్రశ్నించినా వినిపించుకోలేదు. చివరకు కోర్టు మందలించినా పట్టించుకోలేదు. దీంతో ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నది ఆ అభాగ్యురాలు. ఈ అమానవీయ ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా బోనకల్లు హెడ్ కానిస్టేబుల్ తౌడోజు వెంకటేశ్వర్లు కుమారుడు భాస్కరాచారికి ఖమ్మం నగరానికి చెందిన గంగాభవానీతో 2018లో వివాహం అయ్యింది. పెళ్లి అయిన 16 రోజులకే గంగాభవానీకి గుండె కుడివైపు (Heart On Right Side) ఉందని భాస్కరాచారికి తెలిసింది. ఈ విషయం దాచి పెళ్లి చేశారని.. భవిష్యత్తులో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎవరు బాధ్యులు అని భావించి గంగాభవానీని పుట్టింటికి పంపించేశాడు. అప్పట్నుంచి ఆమెను కాపురానికి తీసుకెళ్లలేదు.
దీంతో 2019లో గంగా భవానీ ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. అయితే భాస్కరాచారి తండ్రి పోలీసు కావడంతో అక్కడ వారికి న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో గుండె కుడివైపు ఉండటం వల్ల ఎలాంటి సమస్య ఉండదని.. ఆమెను కాపురానికి తీసుకెళ్లాలని న్యాయస్థానం సూచించింది. కానీ భాస్కరాచారి కుటుంబం లెక్కచేయలేదు. ఈ క్రమంలో భర్త కోసం గంగా భవానీ తన తల్లిదండ్రులతో కలిసి బోనకల్లులోని అత్తారింటికి శుక్రవారం వెళ్లింది. అక్కడ అత్తమామలతో గంగా భవానీకి వాగ్వాదం జరిగింది. అనంతరం గంగాభవానీ ఒక్కదాన్నే ఇంట్లోకి పిలిచిన అత్తామామలు ఆమెపై దాడికి దిగారు. కాగా, అత్తమామల దాడిలో తీవ్రంగా గాయపడి గంగాభవానీ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, భాస్కరాచారి పరారీలో ఉన్నాడు.