ACB Raids on Shiva Balakrishna (PIC@ X)

Hyderabad, JAN 25: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Hmda Former Director Shiva Balakrishna) నివాసం, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు (ACB raids) ముగిశాయి. సుమారు రూ.100 కోట్లు అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. గురువారం తెల్లవారు జామున 3గంటల సమయంలో ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ ఏసీబీ కోర్టులో (ACB court) హాజరుపర్చనున్నారు. బాలకృష్ణ గతంలో హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ గా ఉంటూనే మరోవైపు ఎంఏయూడీ (పురపాలన, పట్టణాభివృద్ధి విభాగం)లో ఇంచార్జి డైరెక్టర్ గానూ కొనసాగాడు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ (HMDA) నుంచి దస్త్రాలను ఆయనే పంపించేవారు. హెచ్ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనలను ఆసరాగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూళ్లు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు బాలకృష్ణ నివాసంతోపాటు కార్యాలయాలు, ఆయన బంధువుల నివాసాల్లో దాడులు నిర్వహించారు.

 

ప్రస్తుతం బాలకృష్ణ మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి, రెరాలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ఏకకాలంగా 20 బృందాలు బాలకృష్ణ ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు ప్రారంభించారు. గురువారం తెల్లవారు జామువరకు ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఇప్పటి వరకు రూ. 100 కోట్లకుపైగా స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. ఇంకా అధికారులు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది.

 

బాలకృష్ణ నివాసం, కార్యాలయాల్లో సుమారు 24గంటలపాటు ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో రూ. 40లక్షల నగదు, రెండు కిలోల బంగారం గుర్తించారు. స్థిర, చరాస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 60 ఖరీదైన చేతి గడియారాలతోపాటు, 14 మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్ టాప్స్ గుర్తించారు. మొత్తం రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడ్డాయి. బాలకృష్ణ నివాసంలో క్యాష్ కౌంటింగ్ యంత్రాలనుసైతం అధికారులు గుర్తించారు. నాలుగు బ్యాంకు లాకర్లుసైతం గుర్తించినట్లు సమాచారం. హెచ్ఎండీఏలో ఉన్నప్పటి నుంచే ఈ ఆస్తులన్నీ కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతల అండదండలతో కోట్ల రూపాయలను బాలకృష్ణ కూడబెట్టినట్లు తెలిసింది. అయితే, ఏసీబీ అధికారులు ఇవాళ బాలకృష్ణను ఏసీబీ కోర్టుకు హాజరుపర్చనున్నారు.