Deepa Das Munsi (PIC @ X)

New Delhi, DEC 23: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీని (Telangana Congress Incharge) కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మార్చేసింది. ప్ర‌స్తుతం ఇన్‌చార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను త‌ప్పిస్తూ శ‌నివారం ఏఐసీసీ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప‌శ్చిమ బెంగాల్ సీనియ‌ర్ నేత దీపాదాస్ మున్షీని నియ‌మిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణే దీపాదాస్ మున్షీ. కాగా, ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీగా వ్యవహరిస్తూ వచ్చిన మాణిక్ రావు ఠాక్రేను గోవా-డయ్యూ డామన్ వ్యవహారాల ఇన్ చార్జీగా నియమించినట్లు వార్తలొచ్చాయి.

 

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు మ‌హారాష్ట్ర మాజీ పీసీసీ అధ్య‌క్షుడు మాణిక్ రావ్ ఠాక్రేను తెలంగాణ ఇన్‌చార్జీగా ఏఐసీసీ నియ‌మించింది. ఠాక్రేకు ముందు ఇన్‌చార్జిగా ప‌ని చేసిన మాణిక్ రావ్ ఠాకూర్‌.. అప్ప‌టి పీసీసీ అధ్య‌క్షుడు, ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీనియ‌ర్లు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీగా మాణిక్ రావ్ ఠాకూర్ ను నియమించినట్లు తెలుస్తున్నది.