CM KCR (Photo-Video Grab)

Nalgonda, FEB 13: నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ సభకు (Nalgonda Public Meeting) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో 300 మంది కూర్చునేలా విశాలమైన వేదికను నిర్మించారు. దాని పక్కనే కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా మరో వేదికను సిద్ధంచేశారు. వేదికకు ఎదురుగా వీఐపీ, మీడియా గ్యాలరీలను నిర్మించారు. వాటి వెనుక ప్రజలు కూర్చునేలా ప్రత్యేకంగా పలు గ్యాలరీలను ఏర్పాటుచేశారు.

 

కేసీఆర్‌ హెలికాప్టర్‌లో వస్తే ఇబ్బంది లేకుండా సభా ప్రాంగణం పక్కనే హెలిప్యాడ్‌ను సిద్ధ్దం చేశారు. నల్లగొండతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరానుండటంతో సభా ప్రాంగణానికి నలువైపులా జనం చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు సభకు పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు చేపడుతున్నది. సభా ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadeesh Reddy) జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కలిసి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

 

పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, చంటి కాంత్రికిరణ్‌, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, కంచర్ల కృష్ణారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, రవీందర్‌సింగ్‌తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే కృష్ణానది ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్‌ సర్కార్‌ తీరును ఎండగట్టడంలో బీఆర్‌ఎస్‌ సక్సెస్‌ అయ్యిందని, ఇదే అంశంపై నల్లగొండలో నిర్వహిస్తున్న కేసీఆర్‌ సభ మీద అందరి దృష్టి కేంద్రీకృతమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. సభకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. సభకు తరలివచ్చే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.