హైదరాబాద్, ఫిబ్రవరి 8: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో భక్తుల నుద్దేశించి ప్రసంగించారు. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతిమను దూరం నుంచి చూస్తే ఆత్మకు శాంతి చేకూరుస్తుందన్నారు. రామానుజాచార్యుడి సమతామూర్తిని దర్శించుకున్న తర్వాత తనలో చైతన్యం పెరిగిందని తెలిపారు. అనేక యుగాలవరకు సనాతన ధర్మ పరిరక్షణకు ఈ రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుందన్నారు. సనాతన ధర్మంలో జీవుడే సత్యం అన్నది వ్యక్తమవుతుందని పేర్కొన్నారు.
Had a great fortune to visit the Statue of Equality in Hyderabad and offer prayers to Sri Ramanujacharya Ji. pic.twitter.com/ni9OSOe0s4
— Amit Shah (@AmitShah) February 8, 2022
రామానుజాచార్యుడు మధ్యే మార్గం విశిష్టాద్వైతాన్ని సూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారు. అందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యుడి బోధనలు చేశారు. రామానుజాచార్యుడు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహం తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయి. ఈ గ్రంథాలు దేశంలోని చాలా గ్రంథాలయాలల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారికే మోక్షం పొందే హక్కు ఉంటుందని రామానుజాచార్యుడు బోధించారు. వినమ్రత, సంస్కరణకోసం చేసే విప్లవం ఇవి రెండు కలిస్తేనే ఉద్దరణ ప్రక్రియ ఆవిష్కారమవుతుంది. దేవాలయాలు, గృహాల్లో పూజ చేయడానికి రామానుజాచార్యుడు విది విధానాలను నిర్దేశన చేశారు’ అని అమిత్ షా పేర్కొన్నారు.