రామకృష్ణ సెల్ఫీ వీడియో, వనమా రాఘవరావు (Image: Youtube)

కొత్తగూడెం, జనవరి 8: తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఘటనలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్ రావు నిందితుడిగా ఉన్నాడు. బాధిత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవనే కారణమని రామకృష్ణ సూసైడ్ నోట్ రాయడంతో పాటు వీడియో కూడా రికార్డు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. దీంతో పోలీసులు మూడు రోజుల తర్వాత శుక్రవారం రాత్రి పోలీసులు వనమా రాఘవను అరెస్టు చేశారు. అయితే.. కుటుబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగరామకృష్ణ రెండవ సెల్ఫీ వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ రెండో వీడియోలో మృతుడు నాగరామకృష్ణ మరిన్ని సంచలన విషయాలను వెల్లడించాడు. తాను చనిపోయే విషయం ప్రజలకు తెలియాలని పేర్కొన్నాడు. తనకు అప్పులు ఇచ్చిన వారికి న్యాయం జరగాలంటూ వీడియోలో వెల్లడించాడు. తాను ఆత్మహత్య చేసుకోవటానికి సూత్రధారి వనమా రాఘవ అంటూ పేర్కొన్నాడు. గత 20 సంవత్సరాల నుంచి తన అక్కతో వనమా రాఘవకు వివాహేతర సంబంధం ఉందంటూ ఈ వీడియోలో ఆరోపించాడు. తన తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తిని ఇవ్వకుండా అమ్మ, అక్క ఇబ్బంది పెడుతున్నారంటూ వెల్లడించాడు. సంవత్సర కాలంగా తనను అప్పుల ఊబిలో నెట్టారని పేర్కొన్నాడు. ఇప్పటికే పోలీసులు వనమా రాఘవను అరెస్టు చేసి కొత్తగూడెం ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. కాగా.. వనమా రాఘవను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మండలం మందలపల్లి, ఏపీ సరిహద్దు ప్రాంతం చింతలపూడి మధ్య రాఘవను అదుపులోకి తీసుకున్నారు.