Karimnagar, SEP 15: కరీంనగర్ జిల్లాలో మరో వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే మంకీపాక్స్ (Mpox) భయం కొనసాగుతుండగా.. ఇప్పుడు కొత్తగా ఓ చర్మ వ్యాధి (Skin Disease) భయపెడుతోంది. ప్రస్తుతం మంకీపాక్స్ అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దీని కారణంగా మరణాలు కూడా భారీగానే సంభవిస్తున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఇటీవల ఇండియాలోనూ ఒక మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వ్యాధి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధి మొదట దురదతో మొదలై క్రమంగా గాయంగా మారుతున్నది. ఇప్పటికే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి.
ఈ సెల్యూలైటిస్ వ్యాధి (Cellulitis Cases) సాధారణ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షనే. కానీ వ్యాధి తీవ్రతతో ప్రమాదకరంగా మారుతున్నది. ఈ చర్మ వ్యాధి ఎక్కువగా కాళ్లపై ప్రభావం చూపుతుంది. నిర్లక్ష్యం వహిస్తే శరీర భాగాలకు సోకే ప్రమాదం ఉంది. సెల్యూలైటిస్ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. ఏటా పదుల సంఖ్యలో ఉండే ఈ వ్యాధి బాధితులు ఈసారి వందల్లో ఉన్నారు.