Begum Bazar Honor Killing : బేగంబజార్ పరువు హత్య నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, కర్ణాటకలో చిక్కిన నిందితులు, నేడు బేగంబజార్ లో స్వచ్ఛందంగా బంద్...
Begum Bazar Honor Killing (Pic Source: Twitter)

Begum Bazar: హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో నిన్న చోటు చేసుకున్న పరువు హత్యను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. బేగంబజార్‌ పరువు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజన బాబాయి కుమారులు స్నేహితులతో కలిసి నీరజ్‌ను హత్య చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్య తర్వాత కర్ణాటక పారిపోయినట్లు గుర్తించారు. కర్ణాటకలోని గుర్‌మిత్కల్‌లో నిందితులను పట్టుకున్నారు. నీరజ్‌ అనే యువకుడు సంజన అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కక్షగట్టిన సంజన సోదరులు, తమ స్నేహితులతో కలిసి నీరజ్‌పై దాడి చేసి హతమార్చారు.

హత్య అనంతరం నిందితులు ద్విచక్రవాహనాలపై పరారయినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితులను సికింద్రాబాద్‌లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు మృతుని నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు నీరజ్ కుటుంబానికి ఈరోజు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పదమేంటో నాకు తెలియదు, నేను తెలుగు సరిగా మాట్లాడలేను, జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట హాజరైన వీసీ సజ్జనార్

బేగంబజార్‌లో పరువు హత్య నేపథ్యంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకు నిరసనగా దుకాణాల బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా బేగంబజార్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. బందోబస్తును వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీ, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే అఫ్జల్‌గంజ్‌ పరిధిలోని కోల్సావాడిలో నివాసముండే నీరజ్ పన్వార్​ బేగంబజార్‌లో తండ్రి రాజేందర్​నాథ్‌తో కలిసి వేరుశనగ గింజల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. అదే ప్రాంతంలో నివాసం ఉండే సంజనతో నీరజ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గతేడాది పాతబస్తీలోని గణేశ్‌టెంపుల్‌లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటివరకు వీరి ప్రేమ వ్యవహారం తెలియకపోవడం.. అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవటంతో యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి ప్రాణభయం ఉందంటూ నవదంపతులు అఫ్జల్‌గంజ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మేజర్లు కావటంతో పోలీసులు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపగా 'నీరజ్‌-సంజన' కలిసి జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం వారికి బాబు జన్మించాడు. అప్పటికే నీరజ్‌పై కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఎలాగైనా హతమార్చాలని పథకం వేశారు.

దారుణంగా హత్య: కొన్ని రోజులుగా నీరజ్‌ కదలికలపై నిఘా పెట్టిన దుండగులు.. రెక్కీ నిర్వహించారు. నిన్న రాత్రి తన తాతయ్యతో కలిసి నీరజ్‌ బయటికి వెళ్లి వస్తుండగా వెంబడించి ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డారు. అతడి తల, మెడపై పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల వద్ద కత్తులు చూసి భయాందోళనకు గురైన స్థానికులు వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయాక రక్తపుమడుగులో పడి ఉన్న నీరజ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా... అప్పటికే నీరజ్‌ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.