Warangal Feb 05: బీజేపీ తొలితరం నేతల్లో ఒకరైన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (Chandupatla Jangareddy) కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా కన్నుమూశారు. వరంగల్ జిల్లాలో (Warangal) చందుపట్ల జంగారెడ్డి (Chandupatla Jangareddy) 18 నవంబర్ 1935 న జన్మించారు. ప్రస్తుతం హన్మకొండలో  (Hanumakonda) నివాసం వుంటున్నారు. సుదేష్మాను 1953లో వివాహం చేసుకున్నారు. దక్షిణభారతదేశం నుంచి బీజేపీ ఎంపీగా (BJP MP) గెలిచిన తొలి వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్ గా పనిచేశారు.

1984లో ఎనిమిదో లోక్‌సభకు (LOKSABHA) హనుమకొండ నియోజకవర్గం (Hanumakonda) నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పీవీ నరసింహారావుపై (PV Narsimharao) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎంపీల్లో జంగారెడ్డి ఒకరు. అదే ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన మరో వ్యక్తి వాజ్‌పేయి (Vajpeyee).

పరకాల నియోజకవర్గం (Parakala) నుండి శాసనసభ్యునిగా భారతీయ జనసంఘ పార్టీ నుండి ఇండిపెండెంట్ బి. కైలాసంపై గెలిచి శాసనససభలో అడుగుపెట్టారు జంగారెడ్డి. అనంతరం భారతీయ జనసంఘ పార్టీ నుండి 1972లో పోటీచేసి పింగళి ధర్మా రెడ్డి (Pingili dharma reddy) చేతిలో ఓటమి చెందారు. తరువాత 1978లో మళ్ళీ పింగళి ధర్మా రెడ్డి పై శాసనసభ్యునిగా భారతీయ జనసంఘ పార్టీ నుండి విజయం సాధించారు జంగారెడ్డి. పరకాల కు బదులుగా ఆయన శాయంపేట (Shyampet) అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకున్నారు.

పరకాల అసెంబ్లీ నియోజకవర్గం S.C రిజర్వ్ కావడంతో ఇద్దరు కూడా రెడ్డి సామాజికవర్గం వారు కావడం వలన పరకాల పక్కనేఉన్న జనరల్ సీటు శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి తలపడ్డారు. 1984 లో బీజేపీ 543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని హనుమకొండ కాగా గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం నుంచి ఏకే పాటిల్ (AK Patil) అనే బీజేపీ నేత గెలిచారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి.

ద‌క్షిణ భార‌త‌దేశం తొలి బీజేపీ తొలి పార్లమెంటు సభ్యుడుగా హ‌నుమ‌కొండ నుంచే ఎంపిక‌య్యారు చందుప‌ట్ల జంగారెడ్డి. ద‌క్షిణ భార‌త‌దేశం నుంచి ఆయ‌నే తొలి బీజేపీ ఎంపీ కావ‌డం ఓ రికార్డు. ఆ స‌మ‌యంలో స్థానికుడు కావడం వలన అభిమానంతో జ‌నం జంగారెడ్డిని ఆద‌రించారు. ఆ విజ‌యం చ‌రిత్ర పుటల్లో భ‌ద్రంగా ఉంది. 1989,1991,1996లో కాంగ్రెస్‌ పార్టీ నుండి కమాలుద్దీన్‌ అహ్మద్‌ చేతిలో జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి పోటీచేసి ఓటమి చెందారు. జంగారెడ్డి మరణం పట్ల బీజేపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు.