Visuals of car that caught fire in Adilabad district | Photo : WhatsApp

Adilabad, February 21: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని నేరడిగొండ మండలంలో గల రోల్‌మామడ టోల్ ప్లాజాకు సమీపంలో ఎన్‌హెచ్ 44 పై శుక్రవారం ప్రమాదవశాత్తూ ఓ కారు దగ్ధమైంది.  డ్రైవింగ్ లో ఉండగానే ఆ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  అయితే  ఈ ప్రమాదం నుంచి అందులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగింది.

పోలీసుల కథనం ప్రకారం, శుక్రవారం శివరాత్రి సెలవు దినం, వరుసగా సెలవులు రావడంతో నిర్మల్ జిల్లా ప్రధాన కార్యాలయ పట్టణంలోని బుధవార్ పేట్‌కు చెందిన ఉప్పుల ఆనంద్ ఆదిలాబాద్ పట్టణంలో గల తన సోదరుడిని కలవడానికి ఫ్యామిలీతో సహా, వారు ఇటీవలే కొన్న కొత్తకారులో బయలుదేరారు.

సుమారు ఒక 35 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత రోల్‌మామడ టోల్ ప్లాజాను దాటిన తరువాత, ఇంజిన్ నుండి పొగలు వెలువడటం అతడు గమనించాడు. వెంటనే అప్రమత్తమైన ఆనంద్, భార్య పిల్లలతో కలిసి కిందకు దిగాడు, ఆ తరువాత క్షణాల్లో కారు మొత్తం మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేసినప్పటికీ అప్పటికే కారు, దాదాపు దగ్ధమైపోయింది. కారులో రూ. 1 లక్ష నగదు కూడా దగ్ధమైనట్లు బాధితుడు తెలిపాడు.  హైదరాబాద్ బంకులో పెట్రోల్ పోస్తుండగా కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లనే వేడి ఎక్కువ అయ్యి మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సాధారణంగా ఎండాకాలంలో లేదా క్రమపద్ధతిలో సర్వీసింగ్ చేయించని పక్షంలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్తగా కొన్నకారు మంటల్లో చిక్కుకోవడం అనుమానాలు రేపుతోంది.